16-11-2025 10:14:22 PM
బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేపట్టాలని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘రన్ ఫర్ సోషల్ జస్టిస్’ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర్ శ్యామ్ నాయక్ ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి జనకాపుర్ వరకు రన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రమేష్ బీసీలకు అన్యాయం జరుగుతుందని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలపై సమితి తల్లి ప్రేమ చూపించడం లేదని విమర్శించారు. రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చే అంశంపైరాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష బృందాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లి ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు సిరికొండ సాయికృష్ణ, బీసీ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు బొట్టుపల్లి ప్రశాంత్, ఆర్.ఎం.పి సంఘం నాయకుడు పొన్నాల నారాయణ,బీసీ సంఘ నాయకులు, యువకులు పాల్గొన్నారు.