16-11-2025 11:01:37 PM
చేర్యాల (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టి నిర్వాకంపై చర్యలు చేపట్టాలని గ్రామ రైతులు ఆదివారం రాత్రి చేర్యాల పోలీస్ స్టేషన్ ముందు రాస్తారోకో చేశారు. చెరువులోని మట్టిని అక్రమంగా తరలిస్తూ, వ్యవసాయ పొలాల వద్దకు వెళ్ళే మట్టి రోడ్డునూ ధ్వంసం చేస్తూ రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఇటుక బట్టి వ్యాపారి రామకృష్ణపై రెవెన్యూ, పోలీస్ అధికారులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
చెరువులోని మట్టిని ప్రభుత్వ అనుమతులు లేకుండా తరలించడమే కాకుండా రోడ్డును ధ్వంసం చేస్తున్నారని ప్రశ్నించిన రైతులపై ఎదురుదాడి చేయడం, బెదిరిస్తున్నారనీ మండిపడ్డారు. రామకృష్ణ అక్రమ వ్యాపారం, చెరువులో మట్టి తరలించడం విషయం అధికారులకు తెలిసిన పట్టించుకోకపోవడం ఇటుక వ్యాపారికి అమ్ముడుపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటుక బట్టినీ సీజ్ చేస్తూ, రామకృష్ణపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతులు ధర్నాలు డిమాండ్ చేశారు.