calender_icon.png 13 August, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత్ర పేరు జడల్!

09-08-2025 12:00:00 AM

నాని హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘ది ప్యారడైజ్’. ఇందులో ఆయన ఇంతకు ముందెన్నడూ చేయని క్యారెక్టర్ చేస్తున్నారు. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టును సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘దసరా’ తర్వాత నాని-శ్రీకాంత్ ఓదెల మరోసారి కలిసి చేస్తున్న సినిమా ఇది. హైదరాబాద్--సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే బలమైన భావోద్వేగాలతో పీరియడ్ యాక్షన్ డ్రామాగా రాబోతోందీ చిత్రం.

ఇటీవల వచ్చిన మేకర్స్ ‘రా స్టేట్‌మెంట్’ పేరుతో గ్లింప్స్ విడుదల చేసిన తర్వాత ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్‌తో అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా మేకర్స్ నాని ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో ఆయన గుబురు గడ్డం, కోరమీసం, రెండు జడలతో కనిపించి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఈ అదిరిపోయే ఫస్ట్‌లుక్‌లో ప్రత్యేకంగా కనిపిస్తున్న రెండు జడలే నానికి పేరుగా మారాయి.

ఇందులో ఆయన పాత్ర పేరును ‘జడల్’ అంటూ చాలా యూనిక్‌గా పరిచయం చేసింది చిత్రబృందం. ‘ఇది ఒక అల్లికగా ప్రారంభమై విప్లవంగా ముగిసింది’ అంటూ ఈ పోస్టర్‌కు చిత్రబృందం పెట్టిన క్యాప్షన్ మరింత క్యురియాసిటీ పెంచింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సినిమా 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ వంటి మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. రాఘవ జూయాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్; సినిమాటోగ్రఫీ: సీ సాయి; ఎడిటర్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.