30-07-2025 10:57:48 PM
ఒకే పార్టీలో నిబద్దతగా పని చేయాలి..
పిసిసి ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ...
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ప్రజలకు సేవ చేయడమే నిజమైన నాయకుడి లక్షణమని నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ(MLA Vamshi Krishna), ఎమ్మెల్సీ కుచ్చుకుల్ల దామోదర్ రెడ్డి(MLC Kuchukulla Damodar Reddy)లు అన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్యక్రమం అధ్యక్షులు చత్రు నాయక్ అధ్యక్షతన జరిగిన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. నాయకుడు ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలతో నేరుగా మమేకమై వారి భవిష్యత్తు కోసం నిబద్ధంగా పని చేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసినప్పుడే గ్రామ పంచాయతీలు బలోపేతం అవుతాయని నాడు రాజీవ్ గాంధీ పంచాయతీ వ్యవస్థను తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్లను అనుసరించి ముందుకు వెళ్లాలని సూచించారు. అంతేకాక, ఒకే పార్టీలో స్థిరంగా, సిద్దాంతపరమైన విధానాలతో పని చేయడం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పార్టీ పట్ల అంకితభావం, ప్రజల పట్ల నిబద్ధత కలిగిన నాయకులే ప్రజల్లో విశ్వాసం చూరగొంటారని అయన అభిప్రాయపడ్డారు.