22 July, 2026 | 2:04 AM

మా గ్రామానికి కలెక్టర్ వచ్చారు..

22-07-2026 12:00 AM

సంబరపడ్డ అంబుగా గ్రామస్తులు 

వర్షం పడుతున్న సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ 

భైంసా జూలై 21 ( విజయ క్రాంతి): అది నిర్మల్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామం. కుంటాల మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు కూత వేటు దూరంలో ఎత్తున కొండపై ఉన్న అంబుగాం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం సందర్శించడంతో గిరిజనులు సంబరపడ్డారు. ఏ సమస్య వచ్చినా గ్రామస్తులు అధికారులకు వద్దకు వెళ్లి సమస్య చెప్పేవారు. అంబుగాం గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్ స్వయంగా వచ్చి వారితో మమేకమై అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఒకవైపు వర్షం కురుస్తున్న గొడుగుల సాయంతో గ్రామం మొత్తం కలియతిరిగి తాగునీటి సమస్య విద్యుత్ సమస్య విద్య వైద్యం మరుగుదొడ్లు సమస్యలపై పూర్తి వివరాలను అడిగారు. పెండింగ్ లో ఉన్న సెల్ ఫోన్ టవర్ పనులపై వారం రోజుల్లో నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ ఈ సందీప్ కుమార్ ను ఆదేశించారు.

ఎత్తున కొండలు సరిగ్గా రహదారి లేని మారుమూల గిరిజన గ్రామం అంబుగంలో కలెక్టర్ పర్యటించడం పై సమస్యలు పరిష్కారం అవుతాయని గ్రామస్తులు ఆశతో అనేక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.భూగర్భ జలాల సంరక్షణకు ఫామ్ పాండ్లు అత్యంత ఉపయోగకరమని పేర్కొన్న కలెక్టర్, ప్రతి రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఫామ్ పాండ్ నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.

గ్రామంలోని రైతు ఏర్పాటు చేసిన ఫామ్ పాండ్ను పరిశీలించి, ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న రైతులతో పాటు కొత్తగా ముందుకు వస్తున్న రైతులను అభినందించారు. గ్రామంలో మరిన్ని ఫామ్ పాండ్లు ఏర్పాటయ్యేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.అలాగే గ్రామంలో టెలికాం సేవల మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

భూగర్భ జలాల పరిరక్షణలో ప్రతి గ్రామస్థుడు భాగస్వామి కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ పర్యటనలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీపీఓ శ్రీనివాస్, డీఆర్డీఓ విజయలక్ష్మి, ఈఈ ఆర్డబ్ల్యూఎస్ సందీప్, తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీడీఓ వనజ, సర్పంచ్ శివాజీ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.