సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణంతో తెలంగాణలోని లక్షలాది మంది సీపీఎస్ ఉద్యోగుల పెన్షన్ సొమ్ము ఆవిరవుతున్నదని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు. ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయని, దీని ప్రత్యక్ష ప్రభావం సీపీఎస్ ఉద్యోగుల కష్టార్జితమైన పెన్షన్ నిధులపై పడుతోందని బుధవారం ప్రకటనను విడుదల చేశారు.
గత కొద్ది రోజులుగా మార్కెట్లు పతనమవ్వడంతో ఉద్యోగుల పర్మినెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్) ఖాతాల్లోని వేలాది రూపాయల సొమ్ము ఆవిరైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల పెన్షన్లపై కార్పొరేట్ పెత్తనం నశించాలని తెలిపారు. సీపీఎస్ విధానం ఎంత ప్రమాదకరమైనదో ప్రస్తుత పరిస్థితులు నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు.
ఎక్కడో జరుగుతున్న యుద్ధానికి, ఇక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ సొమ్ముకు సంబంధం ఏంటి? అని, తమ పదవీ విరమణ జీవితాన్ని అంతర్జాతీయ మార్కెట్ జూదగాళ్ల చేతుల్లో పెట్టడం దుర్మార్గమన్నారు. ఇటీవల క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం, గ్రూప్ 4 ఉద్యోగులకు సుమారు రూ.20 వేల వరకు, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, గెజిటెడ్ , గ్రూప్ 1 స్థాయి అధికారుల వరకు రూ.30 వేల నుంచి రూ.లక్షకుపైగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు పెన్షన్ భరోసానిచ్చే ఓపీఎస్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్కెట్ అనిశ్చితి నుండి ఉద్యోగులకు శాశ్వత విముక్తి కల్పించి సామాజిక భద్రతకు హామీ ఇచ్చే వరకు పోరాటం చేస్తామని ఈమేరకు సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ పేర్కొన్నారు.




