11-11-2025 12:00:00 AM
‘జై బోలో తెలంగాణ.. జనగర్జనలా జడివాన’ అని ఆయన పాడితే ఉస్మానియా యూనివర్సిటీ తొట్టెల్లో వేసిన శిశువు మాదిరి ఊగిపోయింది. కాంక్రీటు జంగల్ లో మాయమైపోతున్న మానవుడిని వెతుకు తున్న సంచారి అందెశ్రీ. ఆయన పాడేవి జోల పాటలు కాదు, జోకుడు పాటలు కాదు.. రాజ్యం జైకొట్టి పడుకోబెట్టెవారి జబ్బచరిచి నిద్రలేపి, ఆత్మగౌరవ యుద్ధానికి సిద్ధం చేసే పోరు పాటలు.
‘జయ జయహే తెలంగాణ’ అంటూ తె లంగాణ రాష్ర్ట గీతాన్ని అందించిన గొంతు మూగబోయింది. ‘జన జాతరలో మనగీతం.. జయకేతనమై ఎగరాలి’ అని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గొంతు మనల్ని భౌతికంగా విడిచిపెట్టిపోయింది. ప్రముఖ కవి, రచ యిత, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ తుదిశ్వాస విడవడం సాహితీ ప్రపంచానికి తీరని శోకాన్ని మిగి ల్చింది. అందెశ్రీ ఏ విధమైన ప్రాథమిక విద్యకు నోచుకోలేదు. బడి మొహం చూడకున్నా.. అక్షరం ముక్క రాకున్నా పల్లెటూరి ప్ర కృతితో, పశువుల మం దతోనే తన బా ల్యం గడిచింది. పైరగాలిలో, పక్షుల గుంపులో, కొండ వాగులో, మ ట్టి వాసనలో ఆయన మనసు కవిత్వం అల్లింది. ఆ ప్రకృతి అనుభవమే ఆయనకు గురువుగా, బడిగా మా రింది.
ఆయన పాటలు, కవిత్వం కేవలం పదాల కూర్పు కాదు. తెలంగాణ నేల ఆత్మ పలికించే సహజసిద్ధమైన ఆశువు కవిత్వంగా మారింది. డాక్టర్ అందెశ్రీ, తెలంగాణ రాష్ర్టంలో పుట్టి, తన అద్భుతమైన సాహిత్యం ద్వారా ప్రజా కవిగా పేరొందారు. అందెశ్రీ జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అందెశ్రీ అనాథగా పెరగడంతో కనీసం చదువుకునే అవకాశం కూడా దక్కలేదు. ఆయన జీవితం గొడ్ల కాపరిగా ప్రారంభమైంది. ఒక రోజు ఆయన పాడుతుండగా విన్న శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర్ మహారాజ్ చేరదీయడం ఆయన జీవితంలో కీలక మలుపు. అందెశ్రీ చదువుకోకపోయినప్పటికీ, ఆయన కవిత్వ ప్రతిభను గుర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటును అందించింది. ఇక, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవిగా అందెశ్రీ కీలక పాత్రను పోషించారు.
పాటలే ఊపిరిగా
అందెశ్రీకి కులం లేదు, మతం లేదు. ఆయనకు సంతానమైన నలుగురు పిల్లలకు ఆయా కుల సర్టిఫికెట్లలో కులం లేదు. తన చిన్ననాటి నుంచి వెంట వచ్చిన కష్టాలను మర్చిపోవడానికి రామాయణం, యక్షగానాలు, కోలాటాల్లో మునిగిపోయేవారు. తెల్లవార్లు మూట కొట్టడం.. పని చేస్తూనే పాటలను ఆశువుగా అల్లుకోవడం అందెశ్రీకి అలవాటు. ఆయన ఏకసంతాగ్రహి కావడం.. బాణీలు, చరణాలు తన తోబుట్టువులు కావడంతో పాట ప్రవాహంలా పరిగెత్తేది. తన గుండె గాయం తలుపులు తీస్తున్న కొద్దీ పాట గేయం మరింత చిక్కగా అయింది. కూలీ పని, మేస్త్రి పని ఇలా తనకు నచ్చిన ప్రతీ పనిని ఎంతో ఇష్టంతో చేసేవారు. బువ్వ లేని బతుక్కు తోడు దుఃఖపూరితమైన జీతం.
64ఏళ్ల అందెశ్రీ జీవితం వడ్డించిన విస్తరి కాదు, వడపోతల జీవితం. ‘తిరగబడనోడు గొప్ప కవి కాదు కదా.. కనీసం కవి కూడ కాలేడు’.. ‘లొంగిపోయేది.. వంగిపోయేది జీవితం కాదు’ అనేవారు అందెశ్రీ. ‘జై బోలో తెలంగాణ.. జనగర్జనలా జడివాన’ అని ఆయన పాడితే ఉస్మానియా యూనివర్సిటీ తొట్టెల్లో వేసిన శిశువు మాదిరి ఊగిపోయింది. కాంక్రీటు జంగల్‌లో మాయమైపోతున్న మానవుడిని వెతుకు తున్న సంచారి అందెశ్రీ. ఆయన పాడేవి జోల పాటలు కాదు, జోకుడు పాటలు కాదు.. రాజ్యం జైకొట్టి పడుకోబెట్టెవారి జబ్బచరిచి నిద్రలేపి, ఆత్మగౌరవ యుద్ధానికి సిద్ధం చేసే పోరు పాటలు. అందెశ్రీ పాటలు రాష్ర్టవ్యాప్తంగా ప్రజాదరణ సంపాదించుకున్నాయి.
ముఖ్యంగా ఆర్.నారాయణ మూర్తి డైరెక్షన్ లో వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక అందెశ్రీ పాటల పాత్ర ఎంతో ఉంది. తెలంగాణ, ప్రకృతి, మానవ సంబంధాల లాంటి అంశాలపై ఆయన రాసిన గేయాలు ప్రజల హృదయాలను చేరుకున్నాయి. ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’, ‘గలగల గజ్జెలబండి’, కొమ్మ చెక్కితే బొ మ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా, ‘జన జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి’.. లాంటి ప్రసిద్ధ గేయాలు అందెశ్రీ కలం నుంచి జాలు వారినవే.
అందెశ్రీ కేవలం ఉద్యమ కవి మాత్రమే కాదు, సమాజంలోని స్వార్థాన్ని, మానవత్వం లేని మనుష్యుల గురించి నిశితంగా ప్రశ్నించిన కవి. ‘మా యమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అం టూ తన పాట ద్వారా నేతి బీరకాయలాంటి మా నవ సమాజంలో పెచ్చుపెరిగిన స్వార్థాన్ని, డబ్బు, పదవుల కోసం కళను తాకట్టు పెట్టి దొరలకు ఊ డిగం చేసిన కవులు, రచయితలు, కళాకారుల ధో రణిని ఆయన నిస్సందేహంగా ధిక్కరించారు. ప దవుల కోసం కళను, సిద్ధాంతాన్ని పణంగా పెట్టేవారికి వ్యతిరేకంగా ఆయన గళం ఎప్పుడూ ధై ర్యాన్ని, చైతన్యాన్ని అందించేది. ఆయన పాట ప్ర జలకు గుణపాఠం నేర్పేది, అన్యాయాన్ని ప్ర శ్నించే స్ఫూర్తిని నింపేది. అందెశ్రీ అకాల మరణం సాహితీ ప్రపంచానికి తీరని లోటే కావొచ్చు.. కానీ ఆయన రచనలు, అందించిన కవిత్వాలను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదు. పోరుపాటల పొద్దుపొడుపు అందెశ్రీకి ఇదే నా జోహార్.
వ్యాసకర్త సెల్ : 9949134467