calender_icon.png 13 November, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ‘జయ కేతనం’

11-11-2025 12:00:00 AM

అందెశ్రీ కేవలం ప్రజాకవి కాదు. ఒక తాత్వికుడు, ఒక భక్తుడు, ఒక తిరుగుబాటుదారుడు. శైవ సిద్ధాంతంపై ఆయనకు అపారమైన ఆకర్షణ. 

‘ప్రకృతే పరమేశ్వరుడు’ అని నమ్మినవారు. అందుకే ఆయన గీతాల్లో ప్రకృతి పులకించేది. ఆయన కవిత్వం మనసును కదిలించేది కాదు.. 

మనసును పూర్తిగా మేల్కొల్పేది. 

అరవై నాలుగేండ్ల తిరుగుబాటు జెండా.. ధిక్కార స్వరం హఠాత్తుగా మూగబోయింది. తెలంగాణ జాతి ఆత్మలో బతికే పద్యం ఒక్కసారిగా స్తబ్దమైపోయింది. ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం’ అనే గీతం విన్న ప్రతిసారీ గుండె లోతుల్లో తెలంగాణ స్ఫూర్తి మేల్కొల్పిన ఆ స్వరం, ఇప్పుడు మౌనంగా నిలిచిపోయింది. అవును. తెలంగాణ రాష్ర్ట గీతాన్ని రాసిన కవి అందెశ్రీ ఇక లేరు! రేబర్తి అనే పల్లె గడప దాటి వచ్చిన గొర్రెల కాపరి ఎల్లయ్య తర్వాతి కాలంలో ‘డాక్టర్ అందెశ్రీ’ అయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, వాషింగ్టన్ అకాడమీ అవార్డులు, లోక్‌నాయక్ పురస్కారం... ఇవన్నీ ఆయన కలలు కాదు. కేవలం కవిత్వానికి దక్కిన న్యాయం మాత్రమే. అక్షరాలన్నీ నేర్చుకోకపోయినా, మట్టివాసన నేర్చుకున్నాడు.

గ్రంథాల పాఠాల కన్నా గడ్డి వాసనతో, గోడ కూల్చిన అనుభవాలతో రాసిన పాటలు ప్రజల ఊపిరిలో కలిసిపోయాయి. ‘మాయమైపోతున్నడమ్మా’ పాటలో ఉన్న ఆ హృద యపూర్వక దుఃఖం తన కండ్లతో చూసిన పల్లె వాస్తవం. అదే పల్లె, అదే వేదన తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ. కవిత్వం ఆయనకు కేవలం వృత్తి కాదు. అది ఆయుధం. ప్రతి పదం ఒక పల్లె మని షి విశ్వాసం. ప్రతి పంక్తి ఒక తిరుగుబాటు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పద్యాలు మంటలు పెట్టాయి. కానీ ఆ మంటల్లో ఇవాళ ఆయన సజీవంగా దహనమయ్యారు. అందెశ్రీకి ధిక్కారం కవిత్వంలోనే కాదు, తన జీవనంలోనూ ఆవహించింది. ప్రభుత్వాలు ఇచ్చిన హోదాలను కూడా కొన్నిసార్లు ‘మట్టిలో కలిసిపోతాయి’ అని నవ్వుతూ చెప్పేవారు.

రోజంతా నడకలోనే జీవించే వారు. తన ఆరోగ్యం గురించి ఎవరన్నా అడిగితే ‘నా గుండె నాకు తెలుసు. అది తెలంగాణ లాంటిదే. ఆగదు!’ అని చెప్పేవారు. అయితే ‘ఆగదు’ అన్న గుండె చివరికి ఆగిపోయింది. జిందా తిలిస్మాత్, అమృతాంజన్, జండూబామ్.. ఇవే ఆయనకు వైద్యం. తన దేహాన్ని కూడా తిరస్కరించే తత్వం చివరికి ఆయనను మట్టిలో కలిపేసింది. ఇంట్లో వంట చేయించుకోవడం కూడా ఆయనకు కట్టుబాటుగా అనిపించేది. ఎక్కువగా హోటల్ ఫుడ్ తినడం అలవాటు. ఆయిల్ ఫుడ్, అసమయ భోజనం, అలసట, నిద్రలేమి.. ఈ మిశ్రమమే ఆయన గుండెను క్రమంగా చుట్టుకుంది. 64 ఏండ్ల వయసులో కూడా 24 ఏండ్ల యువకుడిలా ఉత్సాహంతో తిరిగేవారు. కానీ శరీరం ఆ ఉత్సాహానికి తాళలేక ఒక క్షణంలోనే ద్రోహం చేసింది.

ప్రజల కవి అందెశ్రీ

అందెశ్రీ కేవలం ప్రజాకవి కాదు. ఒక తాత్వికుడు, ఒక భక్తుడు, ఒక తిరుగుబాటుదారులు. శైవ సిద్ధాంతంపై ఆయనకు అపారమైన ఆకర్షణ. ‘ప్రకృతే పరమేశ్వరుడు’ అని నమ్మినవారు. అందుకే ఆయన గీతాల్లో ప్రకృతి పులకించేది. ఆయన కవిత్వం మనసును కదిలించేది కాదు.. మనసును పూర్తిగా మేల్కొల్పేది. నంది పురస్కారం, దాశరథి సాహితీ పురస్కారం, జ్ఞానపీఠ్ ట్రస్ట్ గుర్తింపు ఇవేవీ ఆయన్ను ఆకాశానికెత్తలేదు. అయన్ను ఎత్తినది ప్రజల హృదయం. తెలంగాణలోని ప్రతి పాఠశాలలో ఉదయం వేళ ఆయన గీతం గాల్లో మార్మోగుతుంది. అది ఆయన శ్వాసే. చదువులేని కవి. కానీ జీవితాన్ని పాఠంగా మార్చిన మనిషి. ఆరోగ్యం, ఆహారం, విశ్రాంతి.. ఇవన్నీ ‘సాధారణ మనుషుల వేషాలు’ అని తీసిపారేసేవారు.

తన మేధస్సు, తన ఉత్సాహం అతని స్నేహితులే తప్ప తన శరీరం భరించలేకపోయింది. తన కవితల్లో ‘మరణం’ గురించి ఆయన పదే పదే రాసుకొచ్చారు. ‘మరణమేనా మనిషి? మట్టిలో పుట్టి మట్టిలో కలవడమేనా?’ అని ఆయన అడిగారు. కానీ తన జీవితం చివర్లో, తన శరీరాన్ని చూసుకోకపోవడం ద్వారా అయన మరణాన్ని ప్రత్యక్షంగా ఆహ్వానించారు. అదే ఆయన ధిక్కారం. జీవితానికైనా, మరణానికైనా వంగని ధోరణి. తెలంగాణ మట్టిలో ఎందరో కవులు పుట్టారు. కానీ అందెశ్రీలా తెలంగాణ ఆత్మను అక్షరాల్లో బంధించినవారు అరుదు. ఆయనకు భాషపై ఉన్న ప్రేమ, పల్లెలపై ఉన్న అభిమానం, జీవితాన్ని విసిరేసిన ధైర్యం.. ఇవే ఆయనను ప్రజా కవిగా నిలబెట్టాయి.

ఇప్పుడు ఆయన గీతం పాడిన ప్రతిసారీ, మనం ఆయనను గుర్తు చేసుకోవాల్సిందే. కేవలం కవిగానే కాకుం డా తన ఆలోచనలకే జీవితాన్ని అర్పించిన తిరుగుబాటుదారుడిగా స్మరణ చేసుకోవాలి. అందెశ్రీ శరీరం మట్టిలో కలిసిపోయినా, ఆయన పద్యం గాల్లో తిరుగుతుంది. ప్రతి పల్లె పండుగలో, ప్రతి జాతీయ వేడుకలో ఆయన గీతం గళాలుగా మారుతుంది. తెలంగాణ గీతాన్ని పాడిన ప్రతిసారీ ఆయన శ్వాసే వినిపిస్తుంది. ‘జయ జయహే అందెశ్రీ.. నీ ధిక్కార స్వరం ఎన్నటికీ మూగబోదు’.. అది తెలంగాణ పీడిత ప్రజల గుండెల్లో నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

 వ్యాసకర్త సెల్ : 9912178129