13-10-2025 12:53:12 AM
చోద్యం చూస్తున్న అధికారులు
అలంపూర్, అక్టోబర్ 12: జోగులాంబ గద్వాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది.తుంగభద్ర నది శివారులోని రాజోళి, మెన్నిపాడు, మద్దూరు, తుమ్మిళ్ళ, పెద్ద తాండ్రపాడు గ్రామాల్లో తుంగభద్ర నది నుంచి ట్రాక్టర్ల సాయంతో ఇసుకని నింపుకుని ఒకచోట డంపు చేసి.. రాత్రి వేళల్లో టిప్పర్ల సహాయంతో ఇతర ప్రాంతానికి తరలిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
కొంతమంది అక్రమార్కులు రాజకీయ నాయకుల అండదండతో అధికారుల కనుసన్నుల్లోనే ఈ అక్రమ దందాకు తెరలేపినట్లు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.రాజోళి మండల కేంద్రంలోని పాత రాజోలి ,కోటవీధి బావి దగ్గర, అలాగే తుమ్మిళ్ల ఇసుక రీచ్ ల వద్ద భారీ ఎత్తున ఇసుక నిల్వలు ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. కాగా మన ఇసుక వాహనం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మరికొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపించారు.
దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు గ్రామస్తులు మండిపడ్డారు.ఇసుక టిప్పర్లు అడ్డదారుల్లో గ్రామీణ ప్రాంతాల మీదుగా జాతీయ రహదారి వైపు వెళ్తున్న క్రమంలో రాకపోకలు జరిగి రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రమాదభరితంగా మారుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా మైనింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుని అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిందని ప్రజలు కోరుతున్నారు.