calender_icon.png 13 October, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ బీసీ జేఏసీ

13-10-2025 01:45:48 AM

బీసీ రిజర్వేషన్లపై ఉద్యమ ఉధృతికి ఆరుగురితో కమిటీ చైర్మన్‌గా ఎంపీ ఆర్ కృష్ణయ్య, వైస్ చైర్మన్‌గా వీజీ నారగోని  వర్కింగ్ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్‌గౌడ్ కో చైర్మన్లుగా దాసు సురేశ్, రాజారాం యాదవ్ 

-మీడియా కోఆర్డినేటర్‌గా గుజ్జ కృష్ణ 

-‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో 18న రాష్ట్ర బంద్ 

-బంద్‌తో బీసీల బలమేందో చూపిస్తాం 

-గల్లీ నుంచి ఢిల్లీ దాకా సెగ పుట్టిస్తాం 

-జేఏసీ ఆవిర్భావ భేటీలో ఆర్ కృష్ణయ్య, జాజుల

ముషీరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలోని బీసీ సంఘాలు ఏక తాటిపైకి వచ్చాయి. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు సాధనే లక్ష్యంగా తెలంగాణ బీసీ జేఏసీ ఆవిర్భావించింది. ఆదివారం హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో బీసీ సంఘాల నేతలు సమావేశమయ్యా రు.

బీసీ నేత రాజారాం యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్‌గా ఎంపీ ఆర్ కృష్ణ య్య,  వైస్ చైర్మన్‌గా వీజీ నారగోని, వర్కింగ్ చైర్మన్‌గా జాజుల శ్రీనివాస్‌గౌడ్, కో- చైర్మన్లుగా దాసు సురేశ్, రాజారాం యాదవ్, మీడియా కోఆర్డినేటర్‌గా గుజ్జ కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ జాజుల శ్రీనివాస్‌గౌడ్ సోమవారం తలపెట్టిన జాతీయ రహదారుల దిగ్బం ధం, ఎంపీ ఆర్ కృష్ణయ్య 14న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను వాయిదా వేసి ఈ నెల 18న రాష్ట్ర బంద్‌ను చేపట్టాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు.

బంద్ తో బీసీల బలమేందో చూపిస్తామని, గల్లీ నుంచి ఢిల్లీ దాకా సెగ పుట్టిస్తామని ఆర్ కృష్ణయ్య, జాజుల పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల్లోని ప్రతి కుల సంఘం నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, వాళ్లకు తగి న బాధ్యతలను అప్పగిస్తామని చెప్పారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, బీసీల ను చట్ట సభల్లో కూర్చోబెట్టేవరకు తాము పోరాడతామని స్పష్టంచేశారు. 14న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను 18కి వాయిదా వేసి నట్టు తెలిపారు.

‘బంద్ ఫర్ జస్టిస్’ పేరు తో తెలంగాణ బీసీ జేఏసీ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ వారం రోజుల కార్యాచరణను ఇప్పటికే మొదలు పెట్టామని, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పని చేశామో, అంత కన్నా ఎక్కువగా బీసీ ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. అన్ని పార్టీలను తమ ఉద్యమంలో కలుపుకుని పోతామని పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో ఉద్యమం జరిగితే ఆ ప్రభావం ఇతర రాష్ట్రాల్లో కూడా పడుతుందని, దేశాన్ని కదిలించేలా ఈ బీసీ ఉద్యమాన్ని నిర్వహిస్తామని స్పష్టంచేశారు. 

బీసీల కంచంలో మన్ను పొసేవారికి వ్యతిరేకంగా జేఏసీ: జాజుల

బీసీలు తినే కంచంలో మన్ను పొసేవారికి వ్యతిరేకంగా బీసీ జేఏసీ ఏర్పడిందని జాజుల శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. 60 శాతం జనాభాకు 5 శాతం ఉన్న రెడ్డిలు సవాలు విసిరారని, దానిని స్వీకరిస్తున్నామని తెలిపారు. ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో బీసీల హక్కులు, రిజర్వేషన్లను కాపాడుకోడానికి ఉద్యమానికి సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు.

అసలు యుద్ధం ఈరోజు నుంచి మొదలైందని, బీసీల జనాభా 60 శాతం ఉంటే 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే రెడ్డి జాగృతి అడ్డుకుందని మండిపడ్డారు. మాధవరెడ్డి, గోపాల్‌రెడ్డిలు ఇద్దరు వ్యక్తులకే రెడ్డి సమాజం అండగా ఉందా అని ప్రశ్నించారు. రెడ్డి ఆధిపత్యాన్ని బొంద పెట్టడానికి బీసీ జేఏసీ ఏర్పడిందని వెల్లడించారు. రెడ్డిలు రాజకీయ శత్రువులు అని, బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేసుకునేలా జేఏసీ పని చేస్తుందని స్పష్టంచేశారు.


విద్యా సంస్థలు, ఆర్టీసీ యాజమాన్యం, వ్యాపారుల బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీల ఓట్లు కావాలంటే రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు ఇవ్వాలని సూచిం చారు. మద్దతు ఇవ్వని పార్టీలకు బీసీల ఓట్లు బంద్ పెడతామని హెచ్చరించారు. తమ మధ్య వైరుధ్యాలు లేవని, కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని పేర్కొ న్నారు.

సమావేశంలో 40 బీసీ సంఘాలు, 110 బీసీ కుల సంఘాలతోపాటు బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి, గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్, కొండ దేవయ్య, శేఖర్ సగర, నీల వెంకటేశ్, తాటికొండ విక్రంగౌడ్, కనకాల శ్యాం కుర్మా, కేపీ మురళీకృష్ణ, అనంతయ్య, రామకోటి, వేముల రామకృష్ణ, ఈడిగ శ్రీనివాస్, భూపే శ్ సాగర్, గొడుగు మహేశ్ యాదవ్, వరికుప్పల మధు, గుజ్జ సత్యం, రమాదేవి, లక్ష్మి, భూమన్న యాదవ్, రాజు నేత, దీటి మల్ల య్య, రాజేందర్,  సతీశ్ పాల్గొన్నారు.