calender_icon.png 13 October, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోల్ సాధ్యమేనా!

13-10-2025 01:42:37 AM

ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే టాప్

-ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలు, సొసైటీల్లో కానరాని సదుపాయాలు 

-డ్రయర్లు, ఆరబెట్టే ప్రదేశాలు,  గోదాములు, కవర్లు, తూకం యంత్రాలు లేని వైనం 

-ప్రతీ సీజన్‌లో రైతులు ఇబ్బందులు పడుతున్నా కొనుగోళ్లలో మారని తీరు

-ధాన్యం సేకరణలో ఆటంకాలు కలగనీయమని పాలకులు, అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు 

-ప్రభుత్వం మేల్కోకపోతే అందరికీ నష్టమేనంటున్న రైతు సంఘాల ప్రతినిధులు 

-అందరి చూపు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నూతన అధికారిపైనే..

-స్టీఫెన్ రవీంద్ర సరిచేస్తారా? రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతారా?

హైదరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి) : వరుణుడి శాపం.. మిల్లర్ల కొర్రీ లు.. కూలీల కొరత.. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల లేమి వెరసీ ఏటా అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం శ్రమిం చి పండించిన పంటను అమ్ముకునేందుకు ఆగమాగం అవుతున్నాడు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో తెలంగాణ ధాన్యం దిగుబడిలో దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. రికార్డు స్థాయిలో లక్షల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నది. ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో ధాన్యాన్ని సేకరిస్తుందని మం త్రులు, అధికారులు చెబుతున్నారు.

కానీ క్షేత్రస్థాయిలో సొసైటీలు, ఐకేపీ సెంటర్ల వద్ద వాస్తవ పరిస్థితిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పిస్తున్నామని పాలకులు చెబుతున్నా అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తు న్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాల ప్రభావంతో ధాన్యం సేకరణలో ఆటంకాలు తలెత్తుతున్నాయి. రైతులు ధాన్యం ఆరబెట్టి ఇవ్వాలన్న ప్రభుత్వ సూచ న సరైనదే అయినా, డ్రయర్‌లు లేకపో వడం వల్ల రైతులు ప్రభుత్వ మార్గదర్శకా లు అమలు చేయలేకపోతున్నారు.

ధాన్యం తడిగా ఉండటంతో, ఎండక నాని పాడైపోతుంది. ఈ దయనీయ పరిస్థితుల్లో రైతులు ఆందోళన, ఆవేదనకు గుర వుతున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మిల్లర్ల అవినీతి, రాజకీయ ఒత్తిడి, వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసే ప్రయ త్నంలో ఉన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నూ తన అధికారి స్టీఫెన్ రవీంద్ర అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. స్టీఫెన్ రవీంద్ర ధాన్యం కొనుగోలు జరుగుతున్న అవినీతి, సదుపాయాలు కల్పించడంలో ధైర్యంగా ముందుకు వెళ్తే రైతులకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎండబెట్టే ఇవ్వాలంటున్న ప్రభుత్వ

రాష్ర్టవ్యాప్తంగా కొనసాగుతున్న వర్షాలతో పంట సేకరణలో రైతులకు అనేక సమ స్యలు తలెత్తుతున్నాయి. రైతుల చేతికొచ్చిన ధాన్యం ప్రభుత్వానికి విక్రయించే క్రమంలో సొసైటీలు, ఐకేసీ సెంటర్ల వద్ద ధాన్యం తడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు స్పష్టమైన సూచనలు జారీ చేస్తున్నది.

వర్షా ల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రత్యక్షంగా సొసైటీలు, ఐకేపీల ద్వారా కొనుగోలు చేస్తామని చెబుతున్నప్పటికీ అది కార్యరూపం దాల్చడం లేదు. రైతులు తమ తడిసిన ధా న్యాన్ని ముందుగా ఎండబెట్టి తేమ తగ్గించిన తర్వాతనే కేంద్రాలకు తీసుకురావాలని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ప్రమాణాల ప్రకారం ఆమోదించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. 

కాగితాల్లోనే సదుపాయాలు  

సొసైటీలు, ఐకేపీ కేంద్రాల వద్ద పరిశుభ్రత, నిల్వ సదుపాయాలు బలోపేతం చే యాలని ఆదేశాలు జారీ చేసింది. ధాన్యం సేకరణ వేగవంతం చేసేందుకు సొసైటీలు, ఐకేపీ సెంటర్ల వద్ద ఆరబెట్టే ప్రదేశాలు, గోదాములు, కవర్లు, తూకం యంత్రాలు సిద్ధంగా ఉంచాలని సూచిస్తుంది. కానీ వర్షా లు, కూలీల కొరత, డ్రయర్ సదుపాయాల లేమి వంటివి రైతులకు అతిపెద్ద సమస్యగా మారాయి. పంటను రక్షించాలంటే ప్రభు త్వం వెంటనే ఆరబెట్టే సదుపాయాలు, అత్యవసర చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన సొసైటీలు, ఐకేపీ కేంద్రాల్లో డ్రైయర్లు, ధాన్యం క్లీనర్లు వంటి యంత్రాలు ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ వాస్తవానికి ఈ సదుపాయాలు కేవలం పత్రాలపైనే ఉన్నా యి, ప్రత్యక్షంగా లేకపోవడమే రైతుల నష్టానికి కారణమవుతుంది. దీని వెనుక భారీ అవినీతి, అక్రమాలు దాగి ఉన్నాయని రైతు లు ఆరోపిస్తున్నారు. ధాన్యం తడిసిన నెపం తో మిల్లర్లు రైతులపై అదనపు భారం వేస్తున్నారు. ప్రతి క్వింటాల్‌కు ఒక కిలో అదనపు ధాన్యం తరుగు కింద తీసుకుంటున్నారు. దీంతో మిల్లర్లు, సొసైటీలు, స్థానిక రాజకీయ నాయకుల చేతుల్లో రైతులు దోపిడీకి గురవుతున్నారు. 

ప్రభుత్వ జోక్యం అవసరం

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల పంట నాణ్యత దెబ్బతింటోంది. తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టేందుకు సరైన డ్రయర్ సదుపాయాలు లేకపోవడమే ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు మరింత గందరగోళంలో పడుతున్నారు.

ప్రభుత్వం తక్షణం మొబైల్ డ్రయర్ యూని ట్లు లేదా మిల్లర్ డ్రయింగ్ సదుపాయాలను ఉపయోగించేలా అనుమతిస్తే రైతుల నష్టా లు తగ్గే అవకాశం ఉంటుంది. పంట పాడైతే రైతు దెబ్బతింటాడు, ప్రభుత్వం కూడా సేకరణలో భారీ నష్టాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టేందుకు సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు, పారదర్శక విధానాలు తీసుకోకపోతే అందరికీ నష్టమేనని రైతు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. 

నాణ్యతాలోపంతో ధాన్యం తిరస్కరణ...

రాష్ర్టంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి పోయింది. దీంతో ధాన్యం తేమ శాతం పెరిగి నాణ్యత లోపిస్తుంది. రైతులు, మిల్లర్లు నుంచి నాణ్యమైన ధాన్యం లభించడం లేదు. వర్షాలు, తేమ, తడిసిన ధాన్యం వల్ల పంట నాణ్యత దెబ్బతింటుండటంతో ఎఫ్‌సీఐ సైతం ధాన్యాన్ని ఆమో దించడం లేదు.

ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉండటంతో, ప్రమాణాలు సరిగా లేవంటూ ధాన్యం స్టాక్‌ను తిరస్కరిస్తున్నారు. దీంతో భారీ నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తడిచిన ధాన్యాన్ని ఎండబెట్టి ఇచ్చినా ఎఫ్‌సీఐ ఆమోదించకపోవడం గమనార్హం. దీంతో చేసేందేమీ లేక అటు రైతులు ప్రైవేట్ మిల్లర్లు, దళారులకు, ఇటు మిల్లర్లు మద్యం కంపెనీలకు, ఇతరులకు తక్కువ ధరకే అమ్ముకునే పరిస్థితి దాపురించింది.  

స్టీఫెన్ రవీంద్ర సరిచేస్తారా?

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు నష్టపోతున్న వ్యవస్థలో నిజమైన మార్పు రావాలంటే అధికారుల ధైర్యం, రాజకీయ చిత్తశుద్ధి రెండూ అవసరం. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి పౌరసరఫరాల శాఖ నూతన అధికారి స్టీఫెన్ రవీంద్రపై ఉంది. ఆయన వ్యవస్థను మార్చగలరా? లేక పెద్దల ఒత్తిడికి తలవంచుతారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే స్టీఫెన్ రవీంద్ర స్వయంగా పెద్ద మిల్లర్ల వద్ద తనిఖీలు నిర్వహించారు.

ఆ తనిఖీల్లో గోదాముల్లో ధాన్యం నిల్వ తక్కువగా ఉన్నట్టు గమనించినా, ఆ కొరత వివరాలు ఎక్కడా బయటకు రావడం లేదు. దీంతో రాష్ర్ట హైకమాండ్ ఇప్పటికే స్టీఫెన్ రవీంద్రను కట్టడి చేసిందా.. మిల్లర్ల జోలికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసిందా అని ప్రజల్లో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆయన నిజంగా అవినీతి లాబీని ఎదుర్కొని వ్యవస్థను సరిచేస్తారా? లేక రాజకీయ ఒత్తిడి వలలో చిక్కుకుపోతారా? కాలమే జవాబు చెబుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

గోప్యతకు కారణం రాజకీయ జోక్యమేనా...?  

రాష్ర్టంలో నలుగురు పెద్ద మిల్లర్లు మొత్తం ధాన్యం సేకరణ వ్యవస్థను తమ నియంత్రణలో ఉంచుకున్నారని ఇటీవల జోరుగా చర్చ జరుగుతున్నది. వారికి రాజకీయ మద్దతు ఉండటంతో అధికారులు కూడా వారికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. అలాంటి పెద్ద మిల్లర్లను ఎవరూ ఏమీ చేయలేరని, అధికారులకు కూడా వారిపై చర్యలు తీసుకునే ధైర్యం లేదని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడింది.

అయితే మిల్లర్ల గోదాముల్లో అధికంగా ధాన్యం కొరత ఉన్నట్టు సమాచారం. ఇటీవల తనిఖీల సమయంలో మిల్లర్ల గోదాముల్లో ధాన్యం నిల్వ తక్కువగా ఉందని అధికారులు గమనించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సమాచారాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు బయటపెట్టలేదు. దీంతో నిల్వ లు తక్కువగా ఉన్నా ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదని ప్రజల్లో సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. గోదాముల్లో ధాన్యం నిల్వలు తక్కువగా ఉన్న విషయాన్ని ప్రభు త్వం గోప్యంగా ఉంచడానికి రాజకీయం జోక్యమే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఇటీవల పౌర సరఫరాల శాఖ ప్రధాన అధికారి స్టీఫెన్ రవీంద్ర రాష్ర్టవ్యాప్తంగా ఉన్న మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం నిల్వల స్థితి, సేకరణ ప్రక్రి య, మిల్లుల పనితీరు వంటి అంశాలను పరిశీలించారు. రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, మిల్లర్ల అవినీతి ఆరోపణల నేపథ్యం లో ఈ తనిఖీలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

మిల్లుల్లో ఉన్న నిజమైన నిల్వలను, ధాన్యం నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించామని, ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ ్చరించారు. మిల్లుల్లో అకస్మిక తనిఖీలతో పౌర సరఫరాల శాఖలో కలకలం రేపిన స్టీఫెన్ రవీంద్ర వ్యవస్థను సక్రమం చేయడంలో ఎంతవరకు ముందుకు వెళ్తారనే ప్రశ్నపై ఇప్పుడు చర్చ మొదలైంది.