23 May, 2026 | 12:53 AM

అనుమానపు పిశాచి..!

23-05-2026 12:01 AM
  1. నాకు నచ్చినట్టే ఉండాలంటూ యువతిపై ప్రేమ పేరుతో వేధింపులు
  2. బ్లాక్‌మెయిల్ చేస్తూ నిత్యం దాడులు

కల్వకుర్తి మే 22 :  వారిద్దరి మతాలు వేరు .. ఒకే పాఠశాలలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు . యువకుడు ప్రేమ పేరుతో ఆమెను లోబర్చుకున్నాడు. ప్రారంభంలో ఆమె తిరస్కరించినా కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది . అయితే ఇద్దరి మతాలు వేర్వేరు కావడంతో పాటు యువతిపై చదువుల కోసం బయటకు వెళ్లిన తర్వాత యువకుడిలో అనుమానం పెరిగింది. యువతి చదువుతున్న కాలేజీకి వెళ్లి మరీ దాడులకు పాల్పడ్డాడు.

అప్పటి నుండి వేధింపులు పెరిగాయి అని కల్వకుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాధితురాలు ఆరోపిస్తోంది. కల్వకుర్తి పట్టణానికి చెందిన యువకుడు చనువుగా ఉన్న సమయంలో తీసుకున్న ఫోటోలు, వీడియోలను బయటపెడతానంటూ బెదిరింపులు చేస్తున్నాడని యువతి తెలిపింది. అంతేకాకుండా ఆమె ఎక్కడ పనిచేసినా అక్కడికి వెళ్లి దాడి చేయడం, ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను బెదిరించడం, బంధువుల ఇంటికీ వెళ్లి గొడవ చేయడం వంటి ఘటనలు జరిగాయని పేర్కొంది.

తనతో ఎవరితోనూ ఫోన్లో మాట్లాడొద్దని, దేవాలయాలకు వెళ్లొద్దని, తమ మతానికి అనుగుణంగా తనకు నచ్చినట్లే ఉండాలంటూ ఒత్తిడి తెస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. యువకుడి వేధింపుల నుంచి తప్పించుకోవడానికి  హైదరాబాద్కు వెళ్లగా కుటుంబ సభ్యులు ఊరుకొండ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేయగా, పోలీసులు సెల్ఫోన్ ఆధారంగా ఆమెను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ సమయంలోనే యువతి తనపై జరుగుతున్న వేధింపుల గురించి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు డిఎస్పి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో యువకుడిని కేసు నుంచి తప్పించేందుకు రాజకీయ వర్గాలు శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.