04-12-2025 11:11:14 PM
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్..
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను సర్వీస్ ఓటర్లకు ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు సక్రమంగా,జాగ్రత్తగా జారీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. అర్వపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్టేజ్ -1,2 రిటర్నింగ్ అధికారులు, పంచాయతీ సర్పంచ్,వార్డు సభ్యుల ఎన్నికకు సంబంధించి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికలు నిర్వహించే అధికారులు సిబ్బంది కోసం ఎంపీడీఓ కార్యాలయంలో డిసెంబర్ 6 నుంచి 9 వరకు ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించాలని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి స్టేజ్-1ఆర్వోలు 37ఏ రిజిస్టర్లో సర్వీస్ ఓటర్ల వివరాలు నమోదు చేయాలని, స్టేజ్-2 ఆర్వోలు 37సీ రిజిస్టర్లో ఎన్నికల విధులు నిర్వహించే వారి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.జాజిరెడ్డిగూడెం మండలంలో మొత్తం17 గ్రామపంచాయతీలకు 64మంది సర్పంచ్ అభ్యర్థులు,152వార్డులకు 343మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఎంపీడీఓ ఝాన్సీ కలెక్టర్ కు వివరించారు.రిటర్నింగ్ అధికారులు సంబంధిత గ్రామ పంచాయితీలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని మౌలిక వసతులు ఉన్నాయో లేవో పరిశీలించాలని చెప్పారు.పోలింగ్ తర్వాత ఓట్లను కౌంటింగ్ చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఝాన్సీ,తహసీల్దార్ శ్రీకాంత్,ఎంపీఓ గోపి,రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.