17 August, 2026 | 6:05 PM

కొత్త రెవెన్యూ చట్టం!

24-05-2024 01:25 AM

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే నిర్ణయం 

ధరణికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో టైటిల్ గ్యారెంటీ చట్టం 

రాష్ట్రంలో భూ సమస్యలకు కొత్త చట్టమే పరిష్కారమని భావిస్తున్న సీఎం రేవంత్!

ఎన్నికల ఫలితాల తర్వాత నూతన ఆర్‌ఓఆర్ చట్టంపై స్పష్టత ఇవ్వనున్న ప్రభుత్వం

బూడిద సుధాకర్

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 23 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం రాబోతున్నది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే రాష్ట్రంలో కొత్త ఆర్‌ఓఆర్ (రికార్డు ఆఫ్ రైట్) చట్టంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు న్యాయ నిపుణులతో ప్రభుత్వ పెద్దలు చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని భూ సమస్యలన్నింటికి ధరణి కారణం అని భావిస్తున్న ప్రభుత్వం, ధరణికి ప్రత్యామ్నాయంగా కొత్త ఆర్‌ఓఆర్ (రికార్డు ఆఫ్ రైట్) చట్టం తేవడంపై దృష్టి సారించింది.

ఇందులో భాగంగానే  ధరణికి ప్రత్యామ్నాయంగా టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తామని ప్రకటించడంతో పాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చారు. కొత్త చట్టం తీసుకురావడం వలన ఎన్నికల హామీ నెరవేరడంతో పాటు రైతులకు మేలు జరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ధరణి సమస్యలపై కమిటీ..

రాష్ట్రంలో ధరణి కారణంగా సుమారు 4.50లక్షల పైచిలుకు మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ధరణి సమస్యలపై క్షేత్రస్థాయి అధ్యాయనం, పరిష్కార మార్గాలతో పాటు ధరణి సవరణ, రెవెన్యూ సేవలను మెరుగుపర్చేందుకు తీసుకోవల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు 2024 జనవరి 9వ తేదీన ప్రభుత్వం ఓ కమిటీని నియమిస్తూ 

 జీవో జారీ చేశారు. ఈ కమిటీలో సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, భూ చట్టా ల నిపుణులు భూమి సునీల్ కుమార్, ధర ణి ప్రాజెక్టు పీడీ లచ్చిరెడ్డిని సభ్యులుగా చేర్చారు. ఈ కమిటీ సుమారు ఏడుసార్లు సమావేశమై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందించింది. 

కొత్త చట్టమే పరిష్కారం..

తెలంగాణలో భూ సమస్యలకు కొత్త రెవె న్యూ చట్టం ఒక్కటే పరిష్కారం అని భావిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ధరణి స్థానంలో కొత్త చట్టం తేవాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ధరణితో పోల్చితే అత్యంత పారదర్శకంగా కొత్త రెవెన్యూ చట్టం ఉండాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ చట్టాల నిపుణులతో పాటు రెవె న్యూ శాఖలోని కీలకమైన అధికారులతో ఒక టి రెండు దఫాలుగా చర్చించినట్లు తెలిసింది.

ధరణిలో జిల్లా కలెక్టర్లకు సర్వాధికారా లు ఉండటం, కలెక్టర్ల బిజీ షెడ్యూల్  కారణంగా ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులన్నింటి ని పరిశీలించే పరిస్థితి లేదు. అలాగే తెలంగాణలో నూతన ఆర్‌ఓఆర్ యాక్టు 2020 అమల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీ కోర్టులు రద్దు కావడంతో రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉంది. వీటన్నింటికి కొత్త చట్టం ఒక్కటే పరిష్కారమని ప్రభుత్వ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. 

టైటిల్ గ్యారెంటీ చట్టంపై నజర్

దేశంలో భూ రికార్డుల నిర్వహణలో టైటిల్ గ్యారెంటీ చట్టం అత్యంత ప్రముఖమైనదిగా రెవెన్యూ నిపుణులు పేర్కొంటున్నా రు. ప్రస్తుతం ఈ చట్టం రాజస్థాన్ రాష్ట్రంలో ‘రాజస్థాన్ టైటిల్ గ్యారెంటీ చట్టం  పేరుతో అమలులో ఉంది. దేశంలో టైటిల్ గ్యారెంటీ చట్టం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం రాజస్థాన్. భూమి, ఆస్తిపై యాజమాన్యానికి పూర్తి భరోసా ఈ చట్టం ద్వారా లభిస్తుందని భూ చట్టాల నిపుణులు పేర్కొంటున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో అమలు జరుగుతున్న ఈ చట్టం ప్రకారం ప్రభుత్వానికి నామమాత్రం ఫీజు చెల్లించి కొనుగోలు చేసిన భూమిపై ధృవీకరణ పత్రాన్ని పొందాలి.

భూ యజమాని వద్ద ఉన్న అన్ని పత్రాలను నిశితంగా పరిశీలించడంతో పాటు ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులతో సరిపోల్చుతారు. అన్ని సక్రమంగా ఉన్నాయని ధ్రువీకరించుకున్న తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్‌పై ఎలాంటి అభ్యంతరాలు రాని పక్షంలో భూ యజమానికి రైట్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్‌ను జారీ చేయడంతో పాటు భూమికి సంబంధించిన నక్ష (మ్యాపు)ను హద్దులతో సహా జారీ చేస్తారు.

ఏ చిన్న అభ్యంతరం వచ్చినా పై పత్రాలను జారీ చేయరు. ఆ సమయంలో మాత్రమే భూ యజమానులు సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. భూమి టైటిల్ విషయంలో ప్రభుత్వం తరఫున ఏ చిన్న పొరపాటు జరిగినా కోర్టు ఖర్చులు కూడా ప్రభుత్వమే భరి స్తుంది. భూ యజమానికి నష్టం జరిగితే ప్రభుత్వం పరిహారం కూడా ఇస్తుంది. ప్రస్తు తం దేశంలోని అనేక రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న భూ చట్టాలలో ఇది అత్యంత పారదర్శకమైన, సమర్థవంతమైన చట్టంగా భూ చట్టాల నిపుణులు పేర్కొంటారు. 

ధరణి దారుణాలు ఇవిగో...

* సర్వేనంబర్ తప్పులు, గల్లంతు, భూముల వర్గీకరణ, సంక్రమించిన విధానం లో జరిగిన పొరపాట్లు, విస్తీర్ణంలో హెచ్చు, తగ్గులు, పేరు వివరాల్లో తప్పొప్పులు, ఆధార్‌నమోదు, డిజిటల్ సంతకాలు, పెండింగ్ మ్యుటేషన్లు, సాదాబైనామాలు, నిషేధిత భూముల జాబితాలో పట్టా భూములు.. వంటి సమస్యలను రైతులు ధరణి పోర్టల్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

* ధరణి వెబ్‌సైట్‌కు సంబంధించి ఇప్పటికీ రెవెన్యూ యంత్రాంగానికి పూర్తిస్థాయి అవగాహన లేదు. వీరికి సరైన శిక్షణ ఇవ్వకుండానే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేవ డంతో ధరణిలో సమస్యలు వస్తే రెవెన్యూ అధికారులు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఉంది. 

* భూముల లావాదేవీల్లో పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చింది. కానీ పోర్టల్ ద్వారా కొత్త సమ స్యలు కూడా వస్తున్నాయి. తాతల కాలం నుంచి అనుభవిస్తూ, సాగు చేసుకుంటున్న భూముల వివరాలు కూడా మారిపోవడం, వేరేవారి పేర్లమీద నమోదు కావడం, అసలు జాడే లేకుండా పోవడం వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

* రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను సవరించాలంటూ పెట్టుకున్న దరఖాస్తులు కలెక్టర్ల లాగిన్లలోనే ఉండిపోతున్నాయి. దీంతో సవరణలకు సంబంధించిన దరఖాస్తులు నెలలు, ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి.

* ధరణి రికార్డుల్లో వివరాలు తప్పుడు వచ్చిన రైతులు అత్యవసరానికి భూమిని అమ్ముకోవాలనుకున్నా అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాయి. 

* పాస్‌బుక్కులో చనిపోయిన వారి పేర్లు ఉండడం, ఆధార్ తప్పుగా నమోదు, ఫొటోలు తప్పుగా పెట్టడం, తండ్రిపేరు, పట్టాదార్ పేరు తప్పుగా రాయడం, భూవిస్తీర్ణం ఎక్కువ, తక్కువ రాయడం, సర్వేనంబ ర్ తప్పుగా రాయడం, అసైన్డ్ భూములు మార్పుచేయడం, అటవీశాఖ వివాదాస్పద భూములు రాయడం, రెండు ఖాతాలు రాయడం వంటి తప్పులున్నాయి. 

* 2017లో చేసిన భూరికార్డుల ప్రక్షాళన సమయంలో తగాదా భూములను, కోర్టు కేసులలో ఉన్నవాటిని పార్టు చేర్చారు. నేటికి వీటిలోని మెజార్టీ సమస్యలను పరిష్కరించ లేదు. ఆ రైతుల హక్కుల ను ఎలాంటి భద్రత లేదు. 

* రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ‘రిజిస్ట్రేషన్ నిషేధ భూముల జాబితా సెక్షన్  పేరుతో’ పెట్టారు.. భూమిలో కొంతభాగం అమ్ముకోగా మిగిలిన భూమిని కూడా నిషేధ జాబితాలో పెట్టారు. పట్టా భూములను కూడా నిషేధ పుస్తకంలో పెట్టిన సంఘటనలు కోకొల్లలు. ఎలాంటి తగాదా లేని భూములు కూడా నిషేధ జాబితాలోకి వెళ్లాయి. దీంతో భూమి ఉన్నప్పటికీ క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా పోయింది. 

* ప్రతీ ఏటా ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో గ్రామ సర్వే చేసి రికార్డులను అప్డేడ్ చేసేవారు గతంలో. కానీ ధరణిలో సెక్షన్ 26 సవరణతో ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం, రెవెన్యూశాఖ, తప్పుకొని భూయజమానిపై పెట్టారు. దీంతో అవగాహన లేని రైతులు దీనిని సద్వినియోగం చేసుకోలేని దుస్థితి ఉంది. 

* ప్రస్తుత ధరణి వ్యవస్థ ప్రకారం సాదాబైనామాలతో సహా అన్నిరకాల భూసంబం ధిత ఫిర్యాదులకు(గ్రీవెన్సులు) కలెక్టర్లే పరిష్కారం చేయాల్సిన పరిస్థితి కల్పించారు. ఇవి వేగంగా పరిష్కారం కావడం లేదు. 

* రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం  1971 ప్రకారం మ్యూటేషన్‌పై తహశీల్దార్ల కు రికార్డుల్లో తప్పుల సవరణపై ఆర్డీవోలకు, వాటిని సరి చూసేందుకు జేసీలకు అధికారం ఉండేది. కానీ, కొత్తగా తెచ్చిన రెవె న్యూ చట్టంలో మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని మాత్రమే తహశీల్దార్లకు కట్టబెట్టారు. దరఖాస్తుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన మూడంచెల వ్యవస్థ, కలెక్టర్ల పని ఒత్తిడి లాంటి అంశాల కారణంగా జాప్యం జరుగుతుంది. 

* పాసు పుస్తకాల్లో తప్పులు సరిచేసేందుకు ధరణి పోర్టల్ ద్వారా చేసుకున్న దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. 

* సాదాబైనామాలకు సంబంధించి భూయజమానులకు క్రమబద్దీకరించి పట్టాదారు పాసు పుస్తకాలు నేటికి ఇవ్వలేదు. క్రమబద్దీకరణకు మొదట 15.68 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రెండో విడతలో మరో 9 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కేవ లం 6.18 లక్షలను క్లియర్ చేసినట్టుగా ప్రభు త్వం చెబుతుంది. మిగిలిన 18.50 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి కోర్టు పేరుతో కాలయాపన చేస్తున్నారు. 

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం న్యాయ నిపుణుల సూచనలు..

* భూముల రీ సర్వే చేసి కొత్త రికార్డులను రూపొందించుకోవడం తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం 

* ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలలో రెవెన్యూ సదస్సులు/కోర్టులు/ నిర్వహించి రికార్డులను సరి చేయాలి. 

* ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహించి రికార్డులలో తప్పులుంటే సరి చేయాలి.

* భూమి రికార్డులతో కూడిన ‘భూమి రికార్డుల కిట్’ ను ప్రతి రైతుకు అందించాలి. 

* కంప్యూటర్ రికార్డు భూ యాజమానికి తెలియకుండా ఎలాంటి మార్పులు జరిగే వీలు లేని విధంగా రూపొందించాలి. బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భూమి రికార్డులకు భద్రత చేకూర్చాలి. 

* రైతులకు భూమి రికార్డులపై అవగాహన కల్పించాలి.

* రికార్డుల కంప్యూటరీకరణతో పాటు చట్టాలలో మార్పులు, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ, మెరుగైన భూపరిపాలకు యంత్రాంగం ఏర్పాటు చేయాలి. 

* ఒకే భూమి రికార్డు. ఆ రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వమే హామీ ఇవ్వాలి. భూ యాజమానికి నష్టం జరిగితే పరిహారం చెల్లించాలి. ఇందుకోసం టైటిల్ గ్యారెంటీ చట్టం తేవాల్సిన అవసరం  ప్రభుత్వంపై ఉంది.

కొత్త ఆర్‌ఓఆర్ యాక్టు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్‌ఓఆర్ చట్టం అమల్లో ఉండేది. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 9వ తేదీన ‘రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్ యాక్టు 2020’ పేరుతో కొత్త ఆర్‌ఓఆర్ యాక్టును అమల్లోకి తెస్తూ గెజిట్  (ఎల్.ఏ.బిల్ నంబర్ 7 ఆఫ్ 2020) విడుదల చేసింది. అయితే  ‘ధరణి’ పేరుతో 2018లోనే పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేసిన కేసీఆర్ ప్రభుత్వం, మాన్యువల్ రికార్డు ల స్థానంలో డిజిటల్ రెవెన్యూ రికార్డులను రైతులకు అందించాలని లక్ష్యం గా పెట్టు కుంది.

2020 నవంబర్ 29వ తేదీన మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో నాటి సీఎం కేసీఆర్ ‘ధరణి’ డిజిటల్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ధరణి అమలుతో రెవెన్యూ సేవల్లో వేగం, పారదర్శకత పెరిగినప్పటికీ రికార్డుల నిర్వహణ అత్యంత లోప భూయిష్టంగా మారింది. దీంతో రాష్ట్రంలో కొన్ని లక్షల మంది రైతులు ధరణి కారణంగా ఇబ్బందులకు గురి అవుతున్నారు.