08-05-2025 12:26:02 AM
చెన్నై చేతిలో ఓడిన రహనే సేన
కోల్‌కతా, మే 7: ఐపీఎల్ 18వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కథ ముగిసింది. బుధవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రహనే సేన 2 వికెట్ల తేడాతో పరాజయం పాలయింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిక కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 179 పరుగులు మాత్రమే చేసింది. 180 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా 2 బంతులు మిగిలుండగానే 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌కతాను కూడా ఓడించడంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ దారులు కూడా మూసుకుపోయాయి. ఒక దశలో కోల్‌కతా గెలుస్తుందని అనిపించినా బ్రేవాల్డ్ (52) తుఫాన్ ఇన్నింగ్స్‌తో కోల్‌కతాకు ఓటమిని గిఫ్ట్‌గా ఇచ్చాడు.
చివరి ఓవర్లో కేవలం ఎనిమిది పరుగులే అవసరం కాగా.. ధోనీ చివరి ఓవర్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచి విజయం ఖాయం చేశాడు. చివర్లో అన్షుల్ కంబోజ్ ఫోర్‌తో లాంఛనం పూర్తి చేశాడు. పోయినేడాది టైటిల్ గెలిచిన కోల్‌కతా ఈ ఓటమితో ఈ ఏడు టైటిల్ రేసు నుంచి ఔట్ అయింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లతో కేకేఆర్ నడ్డి విరిచాడు.