8 March, 2026 | 2:13 AM

కన్నతండ్రే కాలయముడు

08-03-2026 12:36 AM
  1. ముగ్గురు పిల్లల్ని చంపిన తండ్రి

చెరువులో తోసి హత్య 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన

కామారెడ్డి, మార్చి 7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం తన ముగ్గురు పిల్లలను కన్నతండ్రే చెరువులో తోసి, హత్య చేశాడు. ముగ్గురు పిల్లలకు టిఫిన్ చేపిస్తానని శనివారం ఉదయం తీసుకువెళ్లి కామారెడ్డి పెద్ద చెరువులో తోసివేసి చంపాడు. శనివారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోని ఆర్బి నగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్కా చెల్లెలు సిపాత్ (8), ఆయాతీ (7), మరియళి(5) తండ్రి ఇస్మాయిల్‌తో కలిసి ఆటోలో షాప్ వద్దకు వెళ్లారు. షాపు వద్ద తినుబండారాలు కొనుక్కున్నారు.

ఆ తర్వాత చిన్నారులు ఇంటికి వెళ్తామని చెప్పడంతో.. తండ్రి జీవనోపాధి నిమిత్తం ఆటో తీసుకొని వెళ్లిపోయాడు. రెండు గంటల అనంతరం తల్లి సబీన తన భర్తకు ఫోన్ చేసి పిల్లలు ఇంటికి రాలేదని చెప్పింది. పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తండ్రిపై అనుమానం వచ్చిన పోలీసులు నిజం చెప్పాలని గద్దించడంతో చెరువులో తోసి చంపేశానని చెప్పాడు.

చెరువులో గాలించగా ఇద్దరు పిల్లల మృతదేహాలు లభించాయి. మరో చిన్నారి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇస్మాయిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తున్నది.

ఇద్దరు చిన్నారుల అదృశ్యం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి (10), విజయ్(9) శుక్రవారం ఇంటి నుంచి బయటకు ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై నరహరి సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపడుతున్నారు.