7 August, 2026 | 3:08 AM

ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

07-08-2026 02:25 AM

డీసీపీఈ శ్రీధర్ 

సికింద్రాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్, బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ సైదులు ఆధ్వర్యంలో బోనాలు పండుగ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులతో అవగాహన సమావేశానికి ముఖ్య అతిథిలుగా డిసిపి సిహెచ్ శ్రీధర్, ఏసిపి పి.గోపాలకృష్ణమూర్తి హాజరయ్యారు.

ఈ సందర్భంగా బోనాలు పండుగను భక్తులందరూ ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణంలో జరుపుకునేలా చూడటానికి, బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ఆలయ కమిటీ బాధ్యులు, ఉత్సవ నిర్వాహకులు, యువజన సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో శాంతి భద్రతల పరిరక్షణ, ఉత్సవాల నిర్వహణపై డీసీపీ సిహెచ్ శ్రీధర్,ఏసిపి పి.గోపాలకృష్ణ మూర్తి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణాలు, క్యూ లైన్లు, మైన్ గేట్లు మరియు ఊరేగింపు జరిగే ప్రధాన మార్గాల్లో స్పష్టమైన విజువల్స్ ఇచ్చే సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచిస్తూ మహిళల భద్రత,క్యూ లైన్లు లోమహిళా భక్తుల సౌకర్యార్థం, భద్రత కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయాలి.

అలాగే రద్దీ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ కమిటీ వాలంటీర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సుప్రీంకోర్టు మరియు ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే సౌండ్ సిస్టమ్స్ వినియోగిస్తూ పరిమితికి మించిన శబ్దాలు కలిగించే సౌండ్ బాక్సులు,డీజేలకు ఎలాంటి అనుమతి లేదు,అనుమతించిన సమయాల్లో మాత్రమే మైక్లు ఉపయోగించాలి అని తెలియజేస్తూ,ప్రతి ఆలయ కమిటీ తరఫున బాధ్యతాయుతమైన వాలంటీర్లను నియమించి, వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించాలి.

వీరు పోలీసులకు ట్రాఫిక్ రద్దీ నియంత్రణలో సహకరించాలి అది తెలియజేశారు.బోనాల ఊరేగింపు, పోతురాజుల ప్రదర్శనలు, ఫలహార బండ్ల రూట్లకు సంబంధించి ముందస్తుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి. నిబంధనలకు లోబడి నిర్దేశించిన మార్గాల్లో మాత్రమే ఊరేగింపులు సాగాలి.విద్యుత్ శాఖ, అగ్నిమాపక, వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని, ఆలయ వద్ద ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.పండుగను ప్రశాంతంగా, వైభవంగా జరుపుకోవడానికి ఆలయ కమిటీలు,భక్తులు పోలీసు అధికారులకు  సహకరించాలని కోరారు.