సారా రక్కసిపై పోరాటం
గుడంబాపై రామోజీ పోరుకు దిగొచ్చిన అప్పటి కాంగ్రెస్ సర్కారు
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): నేటి తరానికి రామోజీరావు ఒక మీడియా మొఘల్‌గా మాత్రమే తెలుసు. కానీ ఆయనలో ఓ దార్శనీకుడు, ఓ సామాజిక ద్రష్ట ఉన్నారని చాలామందికి తెలియదు. 1990 దశకంలో ఉమ్మడి ఏపీని కుదిపేసిన సారా ఉద్యమంలో రామోజీరావు ముందు వరుసలో నిలబడ్డారు. ఈనాడు పత్రికలో సారా వ్యతిరేక పోరాటంపై ఆయన ప్రత్యేక కాలమ్‌ను నడిపారు. నెల్లూరులో పుట్టిన సారా ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేయడంలో కీలక పాత్ర పోషించారు.
సారా వల్ల అనేక మంది జీవితాలు ఛిన్నాభిన్నం అవుతుండటంతో చలించిపోయిన రామోజీరావు సారా వ్యతిరేక పోరాటాన్ని ఈనాడు సాయంతో ముందుడి నడిపారు. రోజూ సారా వ్యతిరేక ఉద్యమ వేదికలు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి వ్యక్తలను పిలవడం, వారు మాట్లాడిన మాటలను ఈనాడులో ప్రముఖంగా వచ్చేలా చేసేవారు. దీంతో కొంతకాలానికే సారా ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఆ తర్వాత రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం మొదలు పెట్టాయి.
1991లో నాటి ప్రతిపక్ష నేత ఎన్టీఆర్ సభ పెట్టి.. సంపూర్ణ మద్యపాన నిషేధానికి తన మద్దతును ప్రకటించారు. ఉద్యమానికి తలొగ్గిన అప్పటి సీఎం కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి సారాను నిషేధించారు. కాంగ్రెస్ సర్కారును గద్దెదింపడానికే రామోజీరావు సారా ఉద్యమాన్ని తెరపైకి తెచ్చారనే విమర్శలు వచ్చాయి. అవేమీ లెక్కచేయకుండా ముందుకెళ్లారు. సారాను నిషేధిం చడంలో ముఖ్య భూమిక పోషించారు. సారా నిషేధంలో పాత్ర పోషించిన రామోజీరావును అనేక మంది ప్రశంసించారు. అలాగే సమాచార హక్కు చట్టంపైనా అవగాహన కల్పించేందుకు ఈనాడులో కాలమ్‌ను రామోజీరావు నడిపారు.






