08-08-2025 01:18:21 AM
- చేనేత కళాకారుల అభివృద్ధిలో మనమే నంబర్ వన్
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ప్రారంభం
ఖైరతాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): అంతరించిపోతున్న చేనేత కళలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకువచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించే చేనేత వస్త్ర ఎగ్జిబిషన్‌ను గురువారం జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు.
చేనేత అనేది కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదు భారతీయ సంస్కృతికి ప్రతీక అని అన్నారు. ఈ కళను పరిరక్షించడం బాధ్యత మనందరి మీద ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం చేనేత రంగంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించిందని, గద్వాల, నారాయణపేట, పోచంపల్లి ఇక్కత్, సిద్దిపేట గొల్లభామ, వరంగల్ దర్రిస్, కరీంనగర్ బెడ్షీట్లు వంటి ఉత్పత్తులు అంతర్జాతీ యంగా పేరుగాంచాయని తెలిపారు. చేనేత ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారానే వస్త్రాలను కొనుగోలు చేయాలనే ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తూ చేనేత కళను కొత్త తరం వరకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా త్రిళింగ పట్టు చీరలను, తెలంగాణ అతెంటిక్ వీవర్స్ లోగో ను ఆవిష్కరించారు. అనంతరం జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ గారు మాట్లాడుతూ.. అంతరించిన పోతున్న చేనేత కళలన్నింటికి పునర్వైభవం తెచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఐ హెచ్ టి ని ప్రారంభించి 120 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డులకు ఎన్నికైన వారిని ఈ సందర్భంగా మంత్రి సత్కరించారు.