08-08-2025 09:15:54 PM
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి వెంకటస్వామి..
మందమర్రి (విజయక్రాంతి): 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి వ్యాప్తంగా ఐక్య ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(CITU) బ్రాంచ్ కార్యదర్శి సాంబారు వెంకటస్వామి స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం సంస్థకు వచ్చిన లాభాలను ప్రకటించాలని కోరుతూ శుక్రవారం ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్ మెంట్ల కార్మికులతో సంతకాలను సేకరించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం మారిన, గుర్తింపు సంఘం మారిన సింగరేణిలో లాభాల ప్రకటన తీరు మారడం లేదని మండిపడ్డారు.
సంస్థసాధించిన లాబాలను ప్రకటించకుండా యాజమాన్యం మీనమేషాలు లెక్కించడంపై కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. లాభాల వాటా పంపిణీ పై గుర్తింపు సంఘం గొప్పలు చెబుతు గతంలో తాము గెలిచినప్పుడు జూన్, జూలైలో ఇప్పించామని చెబుతున్న గుర్తింపు సంఘం నాయకులు ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు అవుతు న్నప్పటికీ యజమాన్యంతో లాభాలను ఎందుకు ప్రకటింప చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. లాభాల ప్రకటన ఆలస్యం అవుతుండడంతో కార్మికులలో గుర్తింపు సంఘం తమ ప్రభావం కోల్పోతుందని, ప్రాతినిధ్య సంఘం ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా యాజమాన్యం లాభాలు చెప్పకుండా ఆలస్యం చేస్తుందని విమర్శించారు.
ప్రతిపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న పట్టించు కోకపోవడం చూస్తుంటే కార్మిక సంఘాల ప్రభావం తగ్గించేలా ఉన్న లేబర్ కోడులను పరోక్షంగా సంస్థలో అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిలో పారి శ్రామిక అశాంతిని రేకెత్తించా లని ప్రభుత్వాలు, యాజమా న్యాలు కలిసి కుట్ర పన్నుతు న్నాయని దీనిలో భాగంగానే కార్మికులలో కార్మిక సంఘాల ప్రభావాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం సరైనది కాదన్నారు. గత ఆర్థిక సంవత్సరం లాభాల ప్రకటన ఆలస్యం చేసి సగం లాభాలను పక్కకు పెట్టడం పట్ల కార్మికులు తీవ్ర నిరాశతో ఉన్నారని మళ్ళీ అలాంటి పనులు చేయకుండా సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలు ప్రకటించి 35% లాభాల వాటా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్య దర్శి అల్లి రాజేందర్, సీనియర్ నాయకులు రామగిరి రామస్వామి, అలువాల సంజీవ్, ఐలయ్య నాయకులు దెబ్బటి తిరుపతి, నాగవల్లి శ్రీధర్, సంకే వెంకటేష్, చీకటి వంశీ, దొండ నవీన్, అయిందాల శ్రీనివాస్, సత్యనారాయణ, బేతి భరత్, బుద్దే సురేష్, ధనిశెట్టి సురేష్, నామని సురేష్, విద్యాసాగర్, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.