08-08-2025 08:03:41 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల(Social Welfare Girls Gurukul College) ప్రాంగణంలోకి గోడ దూకి వచ్చి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన బెల్లంపల్లి మండలానికి చెందిన నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు తాళ్ల గురిజాల ఎస్సై రామకృష్ణ(SI Ramakrishna) తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 6న రాత్రి 12 గంటలకు కళాశాల ప్రాంగణంలోకి నలుగురు వ్యక్తులు గోడదూకి వచ్చారని ప్రిన్సిపల్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ప్రిన్సిపల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపగా కోనూరు కిరణ్, దుగుట సంజయ్(మాల గురిజాల), కొంజన కిరణ్, గొల్లపల్లి కిరణ్(చర్లపల్లి) గ్రామాలకు చెందిన వ్యక్తులు అతిగా మద్యం సేవించి ప్రహరీ గోడ దూకి విద్యార్థినులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో మాట్లాడారని తెలిపారు. కళాశాల వాచ్మెన్ అప్రమత్తమై వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా గోడదూకి పారిపోయినట్లు తెలిపారు. పారిపోయిన వ్యక్తులను శుక్రవారం పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. రాత్రి సమయంలో గస్తీ ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా రాత్రి సమయంలో అనుమానాస్పదంగా కనబడినా, అసాంఘిక చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.