calender_icon.png 8 August, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగుకు తగ్గట్టుగా ఎరువులు ఉన్నాయి

08-08-2025 08:23:09 PM

ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో..

మహబూబాబాద్ (విజయక్రాంతి): వానకాలం పంటల సాగుకు అవసరమైన ఎరువుల నిలువలు ఉన్నాయని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో(District In-charge Collector Lenin Vatsal Toppo) అన్నారు. జిల్లా పరిధిలోని గంగారం మండలంలో ఫర్టిలైజర్ షాప్, కేజీబీవీ, ఎంపీడీవో కార్యాలయాలను ఇన్చార్జి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో ఎరువుల నిలువలను పరిశీలించారు. స్టాక్ వివరాలను, ఆన్లైన్ తదితర వివరాలను డీలర్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత సీజన్ కు అనుగుణంగా జిల్లాలో తగినన్ని ఎరువులు, విత్తనాల స్టాకు ఉన్నాయని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనంతరం కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పెంచే విధంగా, అందుకు అనుగుణంగా ప్రభుత్వం కల్పించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ క్లాసులు (ఏఐ) ద్వారా విద్యా బోధనలను కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వం కల్పించిన డైట్ మెనూ ప్రకారం పక్కాగా నాణ్యత ప్రమాణాలతో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం స్నాక్స్ అందించాలని ఆదేశించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండ్ సంబంధిత పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రజలకు అందించే సేవలలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గంగారం మండలం ఆస్పిరేషనల్ బ్లాక్ గా ఎంపిక అయినందున ఉత్తమ ఫలితాలు అందుకోవడం జరిగిందని అందుకు అనుగుణంగా మండల స్థాయి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అజ్మీర్ శ్రీనివాస రావు ,ఎంపీడీవో మునవర్ బేగ్ పాల్గొన్నారు.