శిశువుల ప్రాణాల రక్షణే లక్ష్యం
రోబోలతో చిన్నపిల్లలకు శస్త్రచికిత్సలు విజయవంతం
ప్రతి సంవత్సరం డిసెంబర్ 29న జాతీయ పీడియాట్రిక్ సర్జరీ దినోత్సవాన్ని నిర్వహిస్తూ, నవజాత శిశువుల నుంచి కౌమార దశ వరకు పిల్లలకు శస్త్రచికిత్సా సంరక్షణ అందిస్తున్నామని, పీడియాట్రిక్ సర్జరీ అంటే కేవలం చిన్న శరీరాలపై శస్త్రచికిత్స చేయడం మాత్రమే కాదు, అత్యంత సున్నితమైన దశల్లో ఉన్న చిన్న ప్రాణాలను కాపాడుతూ, వారికి ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడమే దీని అసలు లక్ష్యమని డా. ఎం యోగా నాగేంద్ర (చీఫ్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్, ల్యాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జన్, కిమ్స్ కడిల్స్, సికింద్రాబాద్) చెప్పారు.
పిల్లల్లో కనిపించే అనేక శస్త్రచికిత్సా సమస్యలు సంక్లిష్టమైనవిగా, జన్మతో వచ్చే లోపాలుగా, ప్రాణాంతకమైనవిగా ఉంటాయి. ఊపిరితిత్తులు, పేగులు, మూత్రవ్యవస్థ, పొత్తికడుపు అవయవాలకు సంబంధించిన ఈ సమస్యలు చిన్న వయసులోనే తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఆధునిక పీడియాట్రిక్ సర్జరీలో వచ్చిన పురోగతితో, ఇప్పుడు ఈ సమస్యలను మరింత కచ్చితత్వంతో, తక్కువ నొప్పితో, వేగంగా కోలుకునే విధంగా చికిత్స చేయడం సాధ్యమైంది.
అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలకూ శరీరానికి తక్కువ దెబ్బతగిలే ఆధునిక పద్ధతులు ఉపయోగించడం వల్ల, పిల్లలు త్వరగా సాధారణ ఎదుగుదల, అభివృద్ధి మార్గంలోకి తిరిగి వస్తున్నారు. అయితే, ప్రతి విజయవంతమైన శస్త్రచికిత్స వెనుక అగోచరమైన కష్టయాత్ర ఉంటుంది. చిన్న, సున్నితమైన శరీర నిర్మాణంపై శస్త్రచికిత్స చేయడంలోని ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొనేందుకు పీడియాట్రిక్ సర్జన్లు ఎన్నో సంవత్సరాల పాటు ప్రత్యేక శిక్షణ పొందుతారు.
ఆపరేషన్ థియేటర్‌లో గడిచే సమయం, తీవ్రమైన శారీరకమానసిక ఒత్తిడి, పిల్లల ప్రాణాలపై ఉండే భావోద్వేగ బాధ్యత, ఇవన్నీ ఈ వృత్తిలో భాగమే. శస్త్రచికిత్స సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం, ఆ పిల్లవాడి, కుటుంబం జీవితాంతం మీద ప్రభావం చూపగలదు. అందుకే ఈ సున్నితమైన శిశువులపై శస్త్రచికిత్స చేయాలంటే పీడియాట్రిక్ సర్జన్ ఎన్నోసార్లు ఆలోచించి, అత్యుత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతోనే అడుగు వేస్తారు. ఈ సవాళ్లన్నింటినీ ఎదుర్కొనే శక్తిని పీడియాట్రిక్ సర్జన్లకు ఇచ్చేది వారి వృత్తిపై ఉన్న గాఢమైన నిబద్ధత.
రేపు పీడియాట్రిక్ సర్జరీ డే
డిసెంబర్ 29న జాతీయ పీడియాట్రిక్ సర్జరీ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, పీడియాట్రిక్ సర్జన్లు, వారి బృందాల నైపుణ్యం, కరుణ, అంకితభావానికి గౌరవం చెల్లించాల్సిన సమయం ఇది. శాస్త్ర విజ్ఞానం, నిబద్ధత కలిసినప్పుడు, అతి చిన్న ప్రాణాలనూ కాపాడి, నయం చేసి, వికసించే అవకాశం కల్పించవచ్చనే శక్తివంతమైన సందేశానికి వారి సేవలు నిలువెత్తు నిదర్శనం.
ఆధునిక పీడియాట్రిక్ సర్జరీ ముఖ్యాంశాలు
పిల్లల కోసం కీహోల్ (ల్యాపరోస్కోపిక్) శస్త్రచికిత్స, రోబోటిక్ శస్త్రచికిత్స, అనువైన ఆధునిక అనస్థీషియా, తల్లి గర్భంలో నుంచే సంరక్షణ (ఫీటల్ కేర్) ముఖ్యమైనవి. పిల్లల్లో మల విసర్జన కోసం పేగులో తాత్కాలిక రంధ్రం ఏర్పాటు చేసే శస్త్రచికిత్సను కొలోస్టమీ అంటారు. ఇది గుదం లేకపోవడం, నర కణాల లోపం లేదా పెద్ద పేగు దెబ్బతినడం వంటి జన్మతో వచ్చే లోపాల్లో అవసరం అవుతుంది. తగిన కాలం తర్వాత, పిల్లవాడు సరైన బరువు పెరిగిన అనంతరం, కొలోస్టమీని తిరిగి మూసే శస్త్రచికిత్స (రివర్సల్ ఆపరేషన్) చేస్తారు.
పీడియాట్రిక్ కొలోస్టమీ సపోర్ట్ గ్రూప్
కిమ్స్ కడిల్స్ పీడియాట్రిక్ సర్జరీ బృందం తరఫున వినూత్నమైన కార్యక్రమంగా పీడియాట్రిక్ కొలోస్టమీ సపోర్ట్ గ్రూప్ ను ప్రారంభిస్తున్నాం. డా. యోగా నాగేంద్ర, డా. మణిషా రెడ్డి, డా. అవినాష్ పాల్రెడ్డి, డా. ఆశిష్లతో కూడిన మా పీడియాట్రిక్ సర్జన్ల బృందం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొలోస్టమీ ఉన్న పిల్లల సంరక్షణలో ఉన్న కుటుంబాల శ్రేయస్సు కోసం ఈ గ్రూప్ పనిచేస్తుంది.




