నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా...
- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల క్రైమ్, జూలై 13 : ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన సమీకృత శిక్షణ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్కు బలమైన పునాది వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఆధునిక బోధనా పద్ధతులను అనుసరించాలన్నారు.
ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రతి రోజు ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉంటూ తన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తరగతి గదిలో విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలను పెంపొందించే విధంగా బోధన సాగించాలని, విద్యార్థులకు వినూత్న విధానాలతో విద్య పట్ల ఆసక్తి కనబరిచేలా బోధించి ప్రోత్సహించాలన్నారు.






