17 March, 2026 | 9:32 AM

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ హామీలను ప్రభుత్వం అమలు చేయాలి

17-03-2026 12:00 AM

జర్పుల దశరథ్ నాయక్ డిమాండ్

కడ్తాల్, మార్చి 16 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కడ్తాల్ మండల కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో గిరిజన భరోసా పథకం కింద ప్రతి గిరిజన కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి, నిధులు కేటాయించాలన్నారు.

ప్రస్తుతం ఉన్న గిరిజన గ్రామ పంచాయతీలను పూర్తిస్థాయి రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించి, తండాల అభివృద్ధికి బాటలు వేయాలని,2024 ఎన్నికల సమయంలో పీసీసీ హోదా లో రేవంత్ రెడ్డి  ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదని, గత రెండున్నర ఏళ్లలో గిరిజనులకు ఎలాంటి న్యాయం జరగలేదని విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో గిరిజన రిజర్వేషన్లను 6% నుండి 10%కి పెంచారని, బంజారాహిల్స్లో సేవాలాల్ భవన నిర్మా ణం, జయంతిని అధికారికంగా నిర్వహించడం వంటి చర్యలతో గిరిజనులకు గుర్తింపు లభించిందని గుర్తు చేశారు.

ప్రస్తుత ప్రభు త్వం కూడా అదే స్ఫూర్తితో పని చేయాలని, లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో గిరిజన సమస్యలపై గళం విప్పాలని కోరారు. కార్య క్రమంలో కుల గురువు బోజ్జ్య మహారాజ్, సర్పంచులు సేవ్య నాయక్, రామ్ చందర్ నాయక్, ప్రియా, రమేష్, చిట్టి రమేష్ నాయక్, శీను నాయక్, లక్ష్మి, భాష, శ్రీధర్ నాయక్, నీలావతి, లోకేష్ నాయక్, మాజీ ఎంపీపీ సువాలి, పంతు నాయక్, మాజీ సర్పంచులు తులసి రామ్ నాయక్, హరి చంద్ నాయక్, శ్వేత, భూనాథ్, మాజీ ఉపసర్పంచ్ శారద పాండు నాయక్, రవి నాయక్, భీమన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.