17 March, 2026 | 2:29 AM

అమనగల్ ‘జల వనిత’కు అరుదైన గౌరవం

17-03-2026 12:00 AM
  1. రాష్ట్రపతి సమక్షంలో దక్కిన గుర్తింపు
  2. జల్ జీవన్ మిషన్‌లో విశేష కృషి.. 
  3. చెన్నంపల్లి ఆనందను సన్మానించిన కలెక్టర్

రంగారెడ్డి, మార్చి 16(విజయక్రాంతి): జల్ జీవన్ మిషన్ అమలులో అంకితభావంతో పనిచేస్తూ, నీటి పొదుపు మరియు నిర్వహణలో ఆదర్శంగా నిలిచిన రంగారెడ్డి జిల్లా, అమనగల్ మండలం, చెన్నంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన తెలగమల్ల ఆనందకు అరుదైన గౌరవం దక్కింది. ఆమె చేసిన విశేష కృషిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమెను ’జల వనిత’  గా ఎంపిక చేసింది.ఇటీవల న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అత్యంత వైభవంగా జరిగిన జల్ మహోత్సవ్ ప్రచార కార్యక్రమం 2026’లో ఆమె పాల్గొన్నారు.

భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము , కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ వంటి ప్రముఖులు హాజరైన ఈ జాతీయ స్థాయి వేదికపై తెలంగాణ ప్రతినిధిగా ఆమె మెరిశారు. ఈప్రతిష్టాత్మక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన ముగ్గురు మహిళా సర్పంచులు, ముగ్గురు ’జల వనితలు’, ముగ్గురు ఎస్ హెచ్ జీ మహిళలలో ఆనంద ఒకరు కావడం విశేషం.

జిల్లా కలెక్టర్ ఘన సన్మానం..

ఢిల్లీలో లభించిన గుర్తింపుతో జిల్లాకు కీర్తి తెచ్చిన తెలగమల్ల ఆనందను సోమవారం కొంగరకలాన్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం అవరణ లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడంలో ఆనంద చూపిన చొరవ అభినందనీయమని, ఆమె స్ఫూర్తితో మరిన్ని గ్రామాల్లో మహిళలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ఆకాంక్షించారు.