24-07-2025 06:51:43 PM
మందమర్రి (విజయక్రాంతి): ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ ఉమ్మడి పోరాట కమిటీ యూపీఎస్సి ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ సతీష్ కుమార్(Mandal Tahsildar Satish Kumar)కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ, విద్యా రంగం సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే దశలవారీ పోరాటంలో భాగంగా మండల తహసీల్దార్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రాలు సమర్పించడం జరిగిందన్నారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, పిఆర్సిని ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ డీఎ లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
సిపిఎస్ ను రద్దుచేసి, ఓపిఎస్ ను అమలు చేయాలని, 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులందరినీ, వారి వారి సొంత జిల్లాలకు పంపించాలని, 2003 డీఎస్సీ నిర్ణయం ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపచేయాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులందరికీ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు జిఒ 25ను సవరించాలని, ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని, టైం స్కేల్ ఇవ్వాలని, గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్, పార్ట్ టైం ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇవ్వాలని, నూతన జిల్లాలకు డిఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు యంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలన్నారు.
ఉపాధ్యాయుల, పెన్షనర్ల, వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ప్రాథమిక పాఠశాలలకు 5571 పియస్ హెచ్‌యం పోస్టులను మంజూరు చేయాలని, పండిట్, పిఈటిల అప్ గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి అయినందున జిఒ 2,3,9,10 లను రద్దు చేసి జిఒ 11,12 ల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని సూచించారు. గురుకుల టైం టేబుల్ సవరించాలని, కెజిబివి, మోడల్ స్కూల్స్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని, కేజిబివి, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని, మోడల్ స్కూల్, గురుకుల సిబ్బందికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలలోని పండిట్, పిఇటి పోస్టులను అప్ గ్రేడ్ చేసి వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించాలనే ఉత్తర్వులను ఉపసంహారించాలని, విద్యారంగంలో ఎన్జిఓ జోక్యాన్ని నివారించాలని, అన్ని జిల్లాలకు శానిటేషన్ గ్రాంట్స్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు పోడేటి సంజీవ్, భూక్యా కిరణ్ కుమార్, దేవ రమేష్, అనంతరావు, వెంకటలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.