calender_icon.png 5 July, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగాచి బాధితులపై ప్రభుత్వ తీరు అమానవీయం

05-07-2025 12:00:00 AM

  1. కార్మికుల మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వలేరా!
  2. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): సిగాచి ఫ్యాక్టరీ పేలుడులో చనిపోయినవారి పట్ల రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమానవీయమని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కార్మికుల మృతదేహాలను అట్టపెట్టెల్లో తరలించడం దారుణమని పేర్కొన్నారు.

పరాయి రాష్ర్టం నుంచి తెలంగాణకు ఉపాధి కోసం వచ్చి చనిపోయిన కార్మికుల మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వలేరా అని ప్రశ్నించారు. భయంకర పేలుడు జరిగి యాభై మందికి పైగా చనిపోతే రేవంత్‌రెడ్డి మాత్రం ఘటన స్థలానికి వెళ్లి ఫొటో షూట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ సమయంలో దేశంలోని ఏ రాష్ర్టం కూడా వలస కార్మికులను పట్టించుకోకపోతే నాటి సీఎం కేసీఆర్ మాత్రం వాళ్లను అక్కున చేర్చుకున్నారని తెలిపారు.

రాష్ట్రాభివృద్ధిలో వలస కార్మికులు వాటాదారులన్నారు.. వాళ్లకూ సమాన హక్కు ఉందని కేసీఆర్ అన్న మాటలను గుర్తు చేశారు. రేషన్, వైద్య సదుపాయంతో పాటు స్వస్థలాలకు వెళ్లడానికి వారికి ఉచిత రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు. సిగాచి పేలుడు తర్వాత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు.

ఘటనలో ఆచూకీ తెలియకుండా పోయినవారి వివరాల కోసం కుటుంబసభ్యులు పోలీసుల కాళ్ల మీద పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు ఎంత మంది కార్మికులు పనిచేస్తున్నారన్న దానిపై కచ్చితమైన సమాచారం లేదని మండిపడ్డారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిన ఘటనలో చనిపోయిన ఎనిమిది మంది మృతదేహాల కోసం ఇప్పటికీ వారి కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారని, వారికి పరిహారం ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస కార్మికులు మనుషులు కారా, చనిపోయిన వారికి కనీస గౌరవం ఇవ్వలేరా అని ప్రశ్నించారు.