calender_icon.png 10 July, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లపై ప్రభుత్వానిది నాన్చివేత ధోరణి

10-07-2025 01:14:38 AM

- నేటి మంత్రివర్గ సమావేశంలో స్పష్టతనివ్వాలి 

- బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ 

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లపై రాష్ర్ట ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంబించకుండా గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో స్పష్టతనివ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  బుధవారం ఒక ప్రకటనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సీఎం నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లి అఖిలపక్ష తేదీని క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయించాలని సూచించారు.

స్థానిక ఎన్నికలపై రాష్ర్ట ప్రభుత్వం తమ చర్యల్ని వేగవం తం చేయాల్సిన అవసరం ఉన్నదని, ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది జీవోల పేరుతో కాలయాపన చేయకుండా చట్టబద్ధమైన బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి తక్షణమే చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని, కానీ అందుకు విరుద్ధంగా ప్రతిరోజు మీడియాలో భిన్న వాదానలు వినిపిస్తున్నాయని తెలిపారు.

ఒకసారి జీవో అని, మరోసారి పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామనడంతో తెలంగాణ రాష్ర్టంలోని బీసీలు గందరగోళానికి గురవుతున్నారని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బాధ్యత తీసుకోవాలని, బీసీల రిజర్వేషన్ల విషయంలో రాజకీయం చేయకుండా నిబద్ధత తో, నిజాయతీతో వ్యవహరించి బీసీ రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి ఈనెల 11వ తేదీన హైదరాబాద్‌లో బీసీ కుల సంఘాలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు.