calender_icon.png 11 July, 2025 | 12:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటుకున్న దత్తాత్రి

10-07-2025 05:28:51 PM

కుభీర్ (విజయక్రాంతి): మండల కేంద్రం కుభీర్ లోని అన్న బావు సాఠే కూడలిలో బుధువారం భైంసా బస్సు ఎక్కే తొందరలో తన చేతిలో ఉన్న మినీ బ్యాగును కూర్చున్న చోటే మర్చిపోయి వెళ్ళిన కుభీర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన బోయిడి తిరుమల.. భైంసాకు వెళ్లిన అనంతరం తన బ్యాగు లేదని గమనించింది. బస్సులో లబోదిబోమంటూ ఏడ్వా సాగింది. చేసేది ఏమీ లేక తన ఇంటికి వెళ్ళిపోయింది. రూ. 22416, పట్టే గొలుసులు, వివిధ కార్డులు కలిగిన ఆ బ్యాగు మండల కేంద్రం కుభీరుకు చెందిన దొంతుల దత్తాత్రికి దొరికింది. ఆయన వెంటనే కుభీర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి డబ్బులు పట్టగొలుసులతో దొరికిన ఆ మినీ బ్యాగును ఎస్సై కృష్ణారెడ్డికి అప్పగించారు.

అందులో ఉన్న కార్డులను పరిశీలించగా కుప్టి గ్రామానికి చెందిన బోయిడి తిరుమల కు చెందినదిగా గుర్తించారు. గురువారం బాధితురాలికి సమాచారం అందించి కుభీర్ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. బ్యాగును పోలీసులకు అప్పగించిన దొంతుల దత్తాత్రిని సైతం స్టేషన్ కు పిలిపించారు. నిర్మల్ అడిషనల్ ఎస్పీ ఉపేంద్ర రెడ్డి, కుభీర్ ఎస్ఐ కృష్ణారెడ్డి బాధితురాలి నుండి పూర్తి వివరాలు సేకరించి డబ్బులు పట్ట గొలుసులతో కూడిన బ్యాగును అప్పజెప్పారు. బ్యాగు దొరకగానే పోలీస్ స్టేషన్ కు తెచ్చి అప్పగించిన దొంతుల దత్తాత్రిని అడిషనల్ ఎస్పీ శాలువాతో సత్కరించి అభినందించారు. నిజాయితీని చాటుకున్న దత్తాత్రిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సుమారు 30 వేల రూపాయల నగదును దొరికిన వెంటనే పోలీస్ స్టేషన్ తెచ్చి పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడని కొనియాడారు. నిజాయితీని చాటుకున్న దత్తాత్రి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. శభాష్ దత్తాత్రి అంటూ ఆయనను నిర్మల్ జిల్లా అడిషనల్ ఎస్పి అభినందించారు.