calender_icon.png 10 July, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌ఎంసీ.. ప్రైవేట్‌కే జై!

10-07-2025 01:17:22 AM

  1. ప్రైవేట్ వైద్య విద్యలో నాణ్యత కరువు..
  2. ప్రభుత్వ వైద్య విద్య కాలేజీలకు ఎన్నెన్నో నిబంధనలు
  3. ప్రైవేట్ కాలేజీల్లో ఎన్ని లోపాలున్నా పట్టించుకోని ఎన్‌ఎంసీ
  4. లంచాలు తీసుకుని ఇష్టారీతిన అనుమతులిస్తున్నారని ఆరోపణలు
  5. ప్రైవేట్ మెడికల్ కాలేజీల వ్యవహారంపై సర్కార్ స్పందించాలంటున్న మెడికోలు
  6. కొత్తగా వచ్చే విద్యార్థులు అన్ని వసతులున్నా కాలేజీలనే ఎంచుకోవాలని సూచన

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) అనేక కొర్రీలు వేసి అనుమతులు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా నిత్యం అదీ లేదు ఇదీ లేదు అంటూ తీవ్రం గా వెంటపడింది. అంతచేసినా కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఇచ్చిన సీట్ల సంఖ్య అశ్చర్యపర్చేలా ఒక్క కాలేజీకి కేవలం 50 మాత్రమే.

అదే పెద్దగా సౌకర్యాలు లేని కొన్ని ప్రైవేటు కాలేజీలలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. ఆర్‌వీఎం, ప్రతి మ మెడికల్ కాలేజీల్లో 250 సీట్ల చొప్పున, కామినేని, చల్మెడ, మమత మెడికల్ కాలేజీల్లో 200 చొప్పున సీట్లున్నాయి. ఇక్కడ ఏటికేడు పెంచుకుంటూ వస్తే ఈ సంఖ్యకు చేరుకున్నాయి. సీట్లను పెంచుకునేందుకు భారీగా రోగులు వస్తున్నట్లు చూపించే సద రు ప్రైవేటు కాలేజీలకు ఎన్‌ఎంసీ తనిఖీలకు వచ్చే సమయంలో కనిపించేదంతా ఆ పూట కూలీ రోగులే.

రోజు కూలీ చెల్లించి హాస్పిటల్‌కు తీసుకువచ్చి ఎన్‌ఎంసీ అధికారులకు చూపించి అనుమతులను కొనసాగిస్తారని ఉత్తర తెలంగాణకు చెందిన పలు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదువుకునే మెడికోలు ‘విజయక్రాంతి’కి తెలిపారు. వైద్యులు లేకపోయినా కూడా వైద్యం అందిస్తున్నట్లు చూపి స్తారని వారు వాపోయారు.

ఇలాంటి మెడికల్ కాలేజీల్లో చదివితే తమకు ఏం ప్రయోజ నం లేకుండా పోతోందన్నారు. నకిలీ రోగులకు తామే నకిలీ కేస్‌షీట్స్ తయారు చేసి ఫైలింగ్ చేస్తున్నామని తెలిపారు. సరిగ్గా ఎన్‌ఎంసీ వచ్చే సమయంలో సమీప గ్రామాల నుంచి బస్సులు పెట్టి మరీ జనాలను తీసుకువస్తారని..వారికి రోజు కూలీ చెల్లించి రోగులుగా చూపిస్తారని అన్నారు. 

వేలిముద్రలను క్లోనింగ్ చేసి ఫ్యాకల్టీ అటెండెన్స్..

ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఫ్యాకల్టీ వేలిముద్రలను క్లోనింగ్ చేసి ఎబాస్ అటెండెన్స్ వేస్తున్నాయి. మరికొన్ని కాలేజీలు తమకు సమీపంలో ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులను ఫ్యాకల్టీగా చూపుతున్నాయి. ఎబాస్‌లో వారి చేత వేలిముద్రలను వేయిస్తున్నాయి. మెజారిటీ ప్రైవేటు కాలేజీల్లో ఇదే తంతు నడుస్తోంది. ప్రొఫెసర్లు లేకుండానే కాలేజీలను నడిపించేస్తున్నారు.

కొన్ని కాలేజీలు సాయంత్రం నాలుగు గంటలకే తాళాలు వేసి వెళ్లిపోతున్నాయనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి అనుబంధ ఆస్పత్రుల్లో రోగులుండాలి. కానీ అంతా తూతూమంత్రంగానే ఉన్నప్పుడు లేని రోగులు ఎక్కడి నుంచి వస్తారని వైద్య విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. వాటి పరిధిలోని టీచింగ్ హాస్పిటల్స్‌గా జిల్లా ఆస్పత్రులు ఉంటున్నాయి.

ధర్మాసుపత్రులు కాబట్టి రోగులు కిటకిటలాడతారు. ప్రస్తుతం సర్కారీ మెడికల్ కాలేజీల సంఖ్య రాష్ట్రంలో 26కు చేరుకోవడంతో ప్రైవేటు మెడికల్ కాలేజీలకు వెళ్లే రోగుల సంఖ్య దాదాపుగా తగ్గింది. దాంతో ప్రైవేటులో రోగులు ఉండటం లేదు. దీంతో కొన్ని కాలేజీలు లేని రోగులను ఉన్నట్లు రికార్డులో చూపుతున్నారు.

మరికొన్ని కాలేజీల్లో అసలు ప్రసవాలే జరగకున్నా..ఆ లెక్కలు చూపుతున్నట్లు సమాచారం. ప్రైవేటు కాలేజీల్లో చదివేవారిలో ఒక్క ఆపరేషన్ చేయకుండానే మాస్టర్ ఆఫ్ సర్జరీ కోర్సు చేసి బయటకు వస్తున్నవారు కూడా ఉంటున్నారని ఓ వైద్యాధికారి చెప్పడం గమనార్హం.

సీట్లు పెరిగినా.. మెరుగైన విద్య లేదు 

రాష్ర్టంలో 61 మెడికల్ కాలేజీల్లో 8,415 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కాలేజీల సంఖ్య పెరిగిపోతూ వస్తున్నా వాటిలో నాణ్యమైన విద్య అందే పరిస్థితి కనిపించడంలేదు. చాలామంది ప్రైవేటు నుంచి బయటకు వచ్చాక సరైన వైద్యం అందించే పరిస్థితి కూడా ఉండకపోవచ్చనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటులో వైద్య విద్య నాణ్యతను పర్యవేక్షించే బాధ్యత కాళోజీ హెల్త్ యూనివర్సిటీపై ఉంటుంది. కానీ ఇప్పటివరకు వర్సిటీ నుంచి పెద్దగా స్పందనే లేదు. విద్యార్థులకు స్టుఫైండ్స్ ఇవ్వకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. 

డబ్బు సంపాదనే ధ్యేయం..

రాష్ర్టంలో వైద్య విద్యలో నాణ్యత మిథ్య గా మారిందని వైద్య విద్యార్థులే చెబుతున్నా రు. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి వైద్య కళాశాలల సంఖ్య 61కి చేరిందని సంబురపడుతు న్నా.. అందుకు తగినట్టుగా ప్రొఫెసర్లు, సదుపాయాలు లేకపోవడంతో వైద్య విద్యలో ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీలు 35 ఉండగా.. అందులో చాలా మేర కాలేజీలు కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా కాలేజీలను నడుపుతున్నా యనే ఆరోపణలున్నాయి.

అందుకే ప్రభుత్వ కాలేజీలతో పోలిస్తే భారీగా సీట్లు పెంచుకున్న ఈ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు 2,155 ఉంటే, మేనేజ్‌మెంట్ కోటా సీట్లు 2,045 ఉన్నాయి. మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు భారీగా వసూళ్లు చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నా..సౌకర్యాలు కల్పించడంలో, ఫ్యాకల్టీని నియమించడంలో మాత్రం పట్టీపట్టనట్లుగా ఉన్నాయి.

ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీల పరిధిలో ఉండే టీచింగ్ హాస్పిటల్స్‌కు రోగులు వచ్చేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. సరైన సౌకర్యాలు, వైద్యులు లేకపోవడం తో రోగుల సంఖ్య తక్కువగా ఉంటోంది. ఎన్‌ఎంసీ తనిఖీలప్పుడు నకిలీ రోగులు, నకిలీ వైద్యులను సిద్ధం చేసుకుంటూ అనుమతులను కొనసాగిస్తున్నారు. 

ప్రైవేటుపై అమిత ప్రేమ..

మెడికల్ కాలేజీల విషయంలో ఎన్‌ఎంసీ వైఖరిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమ ర్శలు వస్తున్నాయి. ఇబ్బడిముబ్బడిగా రోగులు వచ్చే ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతుల విషయంలో నానా యాగీ చేస్తూ.. ప్రైవేటుకు వచ్చే వరకు ఎక్కడ లేని ప్రేమ చూపించడం చూస్తే ఢిల్లీ అధికారుల తీరు అర్థమవుతోంది. రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నోటీసులు ఇచ్చిన ఎన్‌ఎంసీ ఒక్క టంటే ఒక్క ప్రైవేటు కాలేజీకి నోటీసులు ఇవ్వలేదు.

కానీ సింహభాగం కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత, అక్కడి హాస్పిటల్స్‌లో రోగులు లేకపోవడం స్పష్టంగా కనిపిస్తు న్నా కూడా వారు ఇచ్చే మామూళ్ల ఆశ తో ఎన్‌ఎంసీ అధికారులు రెన్యువల్ చే స్తూ వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్‌లో ఫ్యాకల్టీ లేకున్నా ఏ ఒక్క కాలేజీకి కూడా జరిమానా విధించడం లేదు.

అదే సర్కారీ కాలేజీల్లో తనిఖీలు చేసి రూ.10 వరకు జరిమానాలు విధిస్తోంది. ప్రతీ మెడికల్ కాలేజీ విధిగా వార్షిక నివేదికలను ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. అందులో కాలేజీలోని ప్రొఫెసర్లు, ఓపీ, ఐపీ, సర్జరీల గణాంకాలను అప్‌లోడ్ చేయాలి. అధికారులు తనిఖీలు చేసినపుడు ఆ గణాంకాలు సరిపోవాలి. 

కానీ ప్రైవేటులో తనిఖీలు చేసిన తర్వాత కాలేజీలపై తీసుకున్న చర్యలేమీ లేవు. సీట్ల కోత ఉండటం లేదు. నిబంధనలను పాటించని కాలేజీల గుర్తింపు రద్దయ్యే పరిస్థితి కూడా చాలా తక్కువగా ఉంటోంది. రాష్ర్టంలో మెజారిటీ మెడికల్ కాలేజీలు రాజకీయ నాయకులకు చెందినవే.

అందులో అన్ని పార్టీల నేత లూ ఉన్నారు. అందుకే అంతా కూడబలుక్కుని తమపై ఎన్‌ఎంసీ ప్రభావం లేకుండా చక్రం తిప్పుతున్నారనే ఆరోణలున్నాయి. రాష్ట్రంలోని కొందరు మెడికల్ కాలేజీలకు చెందిన యాజమాన్యాలు మాఫియాగా మారి ఇతర రాష్ట్రా ల్లోనూ ఎన్‌ఎంసీ అనుమతుల కోసం పైరవీలు చేశారు. దీనిపై సీబీఐ దృష్టి సారించి పలువురిని అదుపులోకి కూడా తీసుకుంది.

కొత్త విద్యార్థులు జాగ్రత్త పడాలి..

రాష్ట్రంలో ప్రస్తుతం ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఏ కాలేజీని ఎంచుకోవాలి అనే దానిపై చాలా అప్రమత్తంగా ఉం డాల్సిన పరిస్థితి నెలకొంది. రోగులు, వైద్యులు, ఫ్యాకల్టీ లేని కాలేజీలను ఎం చుకుంటే వారు అక్కడ నేర్చుకునేదేమీ ఉండదు. కాబట్టి విద్యార్థులు, వారి తల్లితండ్రులు రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల వ్యవహారంపై శ్రద్ధ పెట్టి విచారణ చేసుకుంటే బాగుంటుందని వైద్యు లు, మెడికోలు సూచిస్తున్నారు.

ఎన్‌ఎం సీ మేరకు ప్రమాణాలు పాటిస్తున్నారా, రోగుల సంఖ్య ఎలా ఉంటోందనేది పరిశీలించాలి. రోగులు లేకుంటే నేర్చుకు నేది ఏమీ ఉండదని,  ఓపీ, ఐపీతోపా టు డెలివరీలు, సర్జరీలు ఎలా జరుగుతున్నాయో కూడా తెలుసుకోవాలని వైద్య నిపుణలు చెబుతున్నారు. అంతా బాగు న్న కాలేజీలనే ఎంచుకోవాలని లేదంటే వైద్య విద్య అనేది ఓ మిథ్యగా మారే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.