22 August, 2026 | 4:03 AM

మహాలక్ష్మీ ఆలయంలో వరలక్ష్మీ వైభవం

22-08-2026 12:15 AM

వాయనాలతో వెల్లువెత్తిన భక్తి

వేములవాడ, ఆగస్టు 21 (విజయక్రాంతి): శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ మహాలక్ష్మీ ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి ఉదయం, సాయంత్రం చతుష్షష్టి ఉపచారాలతో విశేష పూజలు జరిపారు.

సాయంత్రం 4 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి షోడశోపచార పూజలు నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓడి బియ్యం, గాజులు, చీరెసారెలతో వాయనాలు సమర్పించారు. కుంకుమ పూజలు నిర్వహించి కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం, సిరిసంపదలు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు. 

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను ఈవో రమాదేవి ఆధ్వర్యంలో సిబ్బంది పర్యవేక్షించారు. మామిడి ఆకుల తోరణాలు, కొబ్బరి ఆకులు, రంగురంగుల పూలతో ఆలయాన్ని అలంకరించడంతో మహాలక్ష్మీ ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాయి.