తల్లీబిడ్డల ఆరోగ్యమే లక్ష్యం
గజ్వేల్, ఆగస్టు 5 (విజయక్రాంతి) : గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో బాలామృత, బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ కార్ పద్మాబాయి నరసింగరావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ పథకం కింద అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు పోషకాహారంతో పాటు ఆటపాటల ద్వారా ప్రాథమిక విద్య అందించడం, వారి ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడం అంగన్వాడీల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
గర్భిణీలు, బాలింతల ఆరోగ్యాన్ని ఏఎన్‌ఎంలు, అంగన్వాడీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ, తల్లిశిశు సంక్షేమానికి కృషి చేస్తున్నారని, అన్నప్రాశన వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చిన్నారుల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఎం. విజయ నిర్మల, ఆయా రేణుక, డాక్టర్ కిరణ్మయి, ఏఎన్‌ఎం వై. సరస్వతి, ఆశా కార్యకర్తలు భావన, అమృత, పద్మతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.






