అమెరికా రాయబారితో సీఎం భేటీ
హైదరాబాద్, ఆగస్టు 5(విజయక్రాంతి): భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలు చర్చించారు. తెలంగాణలో విద్య, ఉపాధి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాలను పెంచాలని, వీసా అపాయింట్మెంట్లు సకాలంలో లభించేలా సహకరించాలని కోరారు.
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణకు చెందిన వివిధ రంగాల నిపుణుల సమస్యలను కూడా సీఎం రేవంత్‌రెడ్డి రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే అమెరికాలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల భద్రత, సంక్షేమంపై కూడా చర్చించారు.
తెలంగాణలో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారతీయ భాషల్లో తెలుగు ఒకటని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు, రాష్ట్ర బలాలపై రాయబారి చూపిన ఆసక్తిని ముఖ్యమంత్రి అభినందించారు.






