01-05-2025 01:52:07 AM
వనపర్తి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి)/ సీసీకుంట: ఇందిరమ్మ పాలనలో ప్రజల భూ సమస్యలు తీర్చడానికి తెచ్చిన చట్టమే భూభారతి అని, ఈ చట్టం దేశంలోని అనేక రాష్ట్రాలకు చుక్కానిలా నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలోని కురుమూర్తి దేవాలయంలో, వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో నూతన చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్య, నలుగురు వ్యక్తులు కలసి, వారి స్వార్థం కోసం ధరణి చట్టాన్ని తీసుకువచ్చారు. కానీ నిబంధనలు పొందుపరచడం మరిచారు. లోపభూయిష్టమైన ధరణి చట్టం వల్ల రైతులు పడుతున్న సమస్యలు, ఇబ్బందులు గమనించి రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్‌రెడ్డి ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో పడేస్తామని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం దేశంలోని 18 రాష్ట్రాల్లో పర్యటించి, అక్కడి చట్టాలను అధ్యయనం చేసి, వాటిలోని మంచి అంశాలను పొందుపరిచి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. పాస్‌పుస్తకంలో ఏవైనా తప్పులుంటే.. సరిదిద్దుకొనేందుకు ధరణిలో ఎలాంటి అవకాశం లేదు. కానీ భూ భారతి చట్టంలో సవరించుకొనేలా అవకాశం కల్పించాం. అధికారులు తప్పు చేస్తే, వాటిని సరిదిద్దేందుకు రైతులు కోర్టుల చుట్టూ తిరిగితిరిగి రోడ్డున పడ్డారు.
అదే భూభారతి చట్టంలో రూపాయి ఖర్చు లేకుండా తహసీల్దార్ తప్పు చేస్తే ఆర్డీవోకు, ఆర్డీవో తప్పుచేస్తే కలెక్టర్, అక్కడా న్యాయం జరగకుంటే సీసీఎల్‌ఏ లేదా ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసుకొనే అవకాశం కల్పించాం’ అని మంత్రి చెప్పారు. భూమి రిజిస్ట్రేషన్ చేయిసే,్త ముందుగా సర్వే చేయించి.. భూమి పటాన్ని పాస్ పుస్తకంలో ముద్రిస్తామన్నారు. సర్వే చేయడానికి ప్రస్తుతం ఉన్న సర్వేయర్లను వెయ్యి మందికి పెంచుతున్నట్టు చెప్పారు.
ప్రతీ మండలానికి 10 మంది సర్వేయర్ల చొప్పున ప్రైవేట్ సర్వేయర్లకు శిక్షణని చ్చి వారి సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. త్వరలోనే గ్రామ రెవెన్యూ అధికారులను నియమించనున్నట్టు చెప్పా రు. జూన్ 2 నుండి ఆగస్టు 15 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
భూభారతి చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి, రైతులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జీ చిన్నారెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి భూభారతి చట్టంపై మాట్లాడారు.