calender_icon.png 12 July, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐకానిక్ బీఎస్‌ఏ బైక్ వచ్చేసింది

16-08-2024 12:00:00 AM

  1. గోల్డ్‌స్టార్ 650ను విడుదల చేసిన మహీంద్రా 
  2. ప్రారంభ ధర రూ.2.99 లక్షలు

ముంబై, ఆగస్టు 15: మహీంద్రా గ్రూప్ అధీనంలోని ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బీఎస్‌ఏ గురువారం ఇండియాలో ప్రవేశించింది. రూ.2.99 ప్రారంభ ధరతో (ఎక్స్ షోరూమ్) 652 సీసీ మోటార్‌బైక్ గోల్డ్‌స్టార్ 650 మోడల్‌ను విడుదల చేసారు. ప్రపంచంలో పురాతన మోటార్‌సైకిళ్ల కంపెనీల్లో ఒకటైన బిర్మింగ్‌హాం స్మాల్ ఆర్మ్స్ కంపెనీ (బీఎస్‌ఏ)ను 2016లో మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్స్ అండ్ క్లాసిక్ లెజండ్స్ టేకోవర్ చేసింది. ప్రస్తుతం దేశంలో క్లాసిక్ లెజండ్స్ జావా, యెజ్డి బైక్‌లను విక్రయిస్తున్నది.

2021లో పునర్‌ప్రవేశించిన బీఎస్‌ఏ గోల్డ్‌స్టార్ 650 మోటార్‌సైకిల్ ప్రస్తుతం యూరప్, టర్కీ, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో విక్రయమవుతున్నది. తాజాగా భారత్‌లో విడుదలైన గోల్డ్‌స్టార్ 650సీసీ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650కి గట్టి పోటీ ఇస్తుందని ఆటో పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియాకు బీఎస్‌ఏను తీసుకురావడం ద్వారా ప్రపంచ మోటార్‌సైక్లింగ్ చరిత్రలో ఒక భాగాన్ని ఇక్కడ పంచుకుంటున్నామని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చెప్పారు. బీఎస్‌ఏ గోల్డ్ స్టార్ 650 ఎంపికచేసిన అధీకృత డీలర్ల వద్ద లభిస్తాయి. బుకింగ్స్ మొదలయ్యాయి.