calender_icon.png 12 July, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంక్ ఖాతా లేకున్నా.. యూపీఐ చెల్లింపులు

16-08-2024 12:00:00 AM

  1. ప్రాథమిక ఖాతాదారు ఐదుగురి వరకూ అనుమతించవచ్చు
  2. యూపీఐ సర్కిల్ డెలిగేట్ పేమెంట్స్‌ను ప్రారంభించిన ఎన్‌పీసీఐ

న్యూఢిల్లీ, ఆగస్టు 15: బ్యాంక్ ఖాతాలేనివారు సైతం యూపీఐ ద్వారా చెల్లించే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. తాజాగా యూనీఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ప్లాట్‌ఫామ్‌పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)  తాజాగా కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా బ్యాంక్ ఖాతా ఉన్నవారు యూపీఐ ఖాతాలను ఇతరులతో పంచుకోవచ్చు. ఒకే బ్యాంక్ ఖాతాతో కుటుంబ సభ్యులు యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. సెకండరీ యూజర్ వాడుకోవాల్సిన డబ్బుకు పరిమితి పెట్టుకోవచ్చు. బ్యాంక్ ఖాతా లేని కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ప్రయోజనం కల్గించే ఈ ‘యూపీఐ సర్కిల్ డెలిగేట్స్ పేమెంట్స్’ ఫీచర్ వివరాల్ని ఎన్‌పీసీఐ వెల్లడించింది. వివరాలు..

  1. ఒక వ్యక్తి (ప్రైమరీ యూజర్) మరొకరికి (సెకండరీ యూజర్) ఒక పరిమితివరకూ యూపీఐ లావాదేవీలు నిర్వహించే అనుమతిని ఇవ్వవచ్చు.
  2. అలా అనుమతి పొందే వ్యక్తికి యూపీఐతో లింక్ అయిన బ్యాంక్ ఖాతా ఉండాల్సిన అవసరం లేదు. ప్రైమరీ యూజర్ ఖాతా నుంచే యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. 
  3. యూపీఐ డెలిగేట్ పేమెంట్ కోసం ప్రైమరీ ఖాతాదారు తొలుత ఒక మ్యాండేట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఇందుకు తన కాంటాక్టు ఫోన్ నంబర్లలో అనుమతి ఇవ్వదల్చిన నంబరును ఎంచుకోవాలి. గరిష్ఠంగా ఐదుగుర్ని ఎంపికచేసుకునే అవకాశం ఉంది.
  4. కాంటాక్ట్ లిస్ట్ నుంచి కాంటాక్ట్ నంబర్లను ఎంచుకున్న తర్వాత యూపీఐ ఐడీనిఎంటర్‌చేసి/క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి సెకండరీ యూజర్‌ను లింక్ చేయాలి. 
  5. సెకండరీ యూజర్లు ఒక్క ప్రైమరీ యూజర్ డెలిగేషన్ మాత్రమే పొందాలి.
  6. ప్రైమరీ ఖాతాదారు యూపీఐ యాప్‌ను ఉపయోగించి సెకండరీ యూజర్‌ను ఎంపికచేసి, తన తరపున చెల్లింపులు చేసే అనుమతిని ఇవ్వాలి. 
  7. ప్రైమరీ యూజర్ ఇచ్చే డెలిగేషన్‌పై సెకండరీ యూజర్‌కు వచ్చే నోటిఫికేషన్ ఆమోదించిన తర్వాత యూజర్ ఫోన్‌లో యాప్‌తో లావాదేవీలు జరపవచ్చు. 
  8. అలా ప్రాథమిక ఖాతాదారు అనుమతించిన యూజర్‌కు డబ్బు వినియోగంపై పరిమితి విధించవచ్చు.
  9. సెకండరీ యూజర్‌కు ప్రైమరీ యూజర్ పూర్తి డెలిగేషన్ ఇస్తే నేరుగా చెల్లింపులు చేసుకోవచ్చు,
  10. షరతుతో డెలిగేషన్ ఇస్తే సెకండరీ యూజర్ చెల్లింపు జరిపేటప్పుడు వచ్చే రిక్వెస్ట్‌ను ప్రైమరీ యూజర్ యూపీఐ పిన్‌తో ఆమోదించాలి. 
  11. పూర్తి డెలిగేషన్ పొందిన సెకండరీ యూజర్‌కు ఒకే దఫా గరిష్ఠంగా రూ.5,000 వరకూ చెల్లింపులు చేసేందుకు ప్రైమరీ యూజర్ అనుమ తించవచ్చు. నెలకు ఈ పరిమితి రూ. 15,000. పాక్షిక డెలిగేషన్ పొందినవారు ప్రస్తుత యూపీఐ పరిమితి ప్రకారం చెల్లింపులు జరపవచ్చు. 
  12. సెకండరీ యూజర్ జరిపే లావాదేవీలు ప్రైమరీ యూజర్ యూపీఐ యాప్, బ్యాంక్ ఖాతాలో నమోదు అవుతాయి.