19-03-2025 10:33:15 PM
ఎల్బీనగర్: హయత్నగర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కాయకల్ప బృందం బుధవారం పరిశీలించింది. కాయకల్ప తనిఖీ అధికారి, సివిల్ అసిస్టెంట్ సర్జన్ కె. శోభ నేతృత్వంలోని హతీరాం, నాగలక్ష్మి బృందం ఆసుపత్రిలోని అన్ని వార్డులను స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నాయా? లేదా అని ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ పరిశీలించారు. ఆసుపత్రిలోని ఆయా వార్డులు, వార్డుల్లో ఉన్న ఇన్‌పేషెంట్‌లను అడిగి సౌకర్యాల గూర్చి తెలుసుకున్నారు. ఇన్, అవుట్ పేషెంట్లకు ఇచ్చే ఇంజక్షన్‌లు, మందులు ఎక్స్‌పైరీ అయ్యాయా, డేట్ ఉందా? అన్న విషయాలను స్వయంగా పరిశీలించారు. లేబర్ రూంలో సౌకర్యాలు, శుభ్రంగా ఉందా? లేదా? ఆసుపత్రి సిబ్బంది గదులను కూడా పరిశీలించారు.
గాయాలైన వారికి ప్రథమ చికిత్సలు అందించే గదిని పరిశీలించి అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది డ్రెస్ కోడ్ పాటిస్తున్నారా? లేదా కూడా తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని పరిసర ప్రాంతాలను పరిశీలించిన బృందం సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర బృందం పర్యటిస్తుందన్నారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఉమాతో పాటు సిబ్బందితో వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమా మాట్లాడుతూ.. ఆయా విభాగాల్లో మంచి ర్యాంకు వస్తే హయత్ నగర్ సీఎస్సీని నియమిస్తారని సూపరిండెంట్ ఉమా తెలిపారు. డాక్టర్లు దుర్గ, శేఖర్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.