27-11-2025 01:03:48 AM
ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరి కృషి ప్రశంసనీయం
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
రాజ్యాంగ దినోత్సవ సభలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
సంవిధాన్ సదన్‌లో ప్రత్యేక కార్యక్రమం
పాల్గొన్న ఉప రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్, విపక్షనేతలు ఖర్గే, రాహుల్
తొమ్మిది భాషల్లో అనువదించిన భారత రాజ్యాంగం పుస్తకం విడుదల
డిజిటల్ వర్షన్‌లను విడుదల చేసిన రాష్ట్రపతి
న్యూఢిలీ, నవంబర్ 26 : భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం రాజ్యాంగమని రాష్ట్రపతి ముర్ము అన్నారు. బుధవారం ఢిల్లీ సంవిధాన్ సదన్‌లోని సెంట్రల్ హాల్ వేదికగా రాష్ట్రపతి నేతృత్వంలో 75 రాజ్యాంగ దినోత్సవ సభ జరిగింది. కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ విపక్షనేత మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను ఇస్తుందని తెలిపారు. రాజ్యాంగ దినోత్సవ చారిత్రాత్మక సందర్భంగా మీ అందరి మధ్య ఉండటం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. రాజ్యాంగం.. దేశ ఆత్మగౌరవాన్ని నిర్ధారించిందని, వలసవాద మనస్తత్వాన్ని విడిచిపెట్టి జాతీయవాద ఆలోచనలను స్వీకరిం చడానికి మార్గదర్శక పత్రమని పేర్కొన్నారు.
రాజ్యాంగ నిర్మాతలు దేశ పౌరుల వ్యక్తిగత, ప్రజాస్వామ్య హక్కులను ఎల్లప్పుడూ పరిరక్షించాలని కోరుకున్నారని తెలిపారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అన్ని వర్గాల వారు బలోపేతం చేస్తున్నారని రాష్ట్రపతి ప్రశంసించా రు. భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని రాష్ట్రపతి అన్నా రు.
దేశం సాధించిన అతిపెద్ద విజయాలలో 25కోట్ల మందిని పేదరిక నుంచి బయటికి తీసుకురావడం ఒకటని రాష్ట్రపతి అన్నారు. నవంబర్ 26, 1949న రాజ్యాంగ సభ సభ్యు లు భారత రాజ్యాంగాన్ని రూపొందించే పనిని పూర్తి చేశారని గుర్తుచేశారు. ముసాయిదా కమిటీ చైర్మన్ బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్.. రాజ్యాంగ ప్రధాన శిల్పిలో ఒకరు అని పేర్కొన్నారు.
తొమ్మిది భాషల్లో రాజ్యాంగం..
తొమ్మిది భారతీయ భాషల్లో అనువదించి న రాజ్యాంగాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. మలయాళం, మరాఠీ, నేపా లీ, పంజాబీ, బోడో, కాశ్మీరీ, తెలుగు, ఒడియా, అస్సామీల తో సహా తొమ్మిది భాషల్లో అనువాద వెర్షన్లను రాష్ట్రపతి విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పౌరులకు రాజ్యాంగం అందుబాటులోకి తీసుకురావడం, రాజ్యాంగ హక్కు లు, విధులపై అవగాహన పెంచడం ఈ చర్య అద్భుతం అంటూ ప్రశంసించారు.
మహనీయుల కృషి ఫలితంగానే.. : లోక్‌సభ స్పీకర్
రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవిశ్రాంత కృషి ఫలితంగానే దేశంలోని ప్రతి పౌరునికి న్యాయం, సమానత్వం, సోదరభావం, గౌరవాన్ని అందించే అద్భుతమైన రాజ్యాంగం ఏర్పడిందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
ఏడు దశాబ్దాలుగా రాజ్యాంగ మార్గదర్శకత్వంలోనే అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు విధానాలు, చట్టాలను రూపొందించామని ఈ సందర్భంగా బిర్లా వివరించారు. సుపరిపాలన, సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రయా ణం రాజ్యాంగం ద్వారానే సాధ్యమైందని తెలిపారు.
వికసిత్ భారత్ వైపు అడుగులు వేయాలి: ఉప రాష్ట్రపతి
రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తితో వికసిత్ భారత్ లక్ష్యం వైపు అందరూ అడుగులు వేయాలని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన పార్లమెంట్‌లో మాట్లాడారు. మన రాజ్యాంగపు ఆత్మ..భారత్ ఒక్కటేనని నిరూపించిందని , అది ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుందన్నారు. రాజ్యాంగం సామాజిక న్యా యం, బలహీన వర్గాల ఆర్థిక సాధికారతపై నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
రాజ్యాంగ విధులే ప్రజాస్వామ్యానికి పునాదులు
రాజ్యాంగ దినోత్సవం వేళ దేశ ప్రజలకు మోదీ లేఖ
న్యూఢిల్లీ, నవంబర్ 26 : రాజ్యాంగ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని దేశ పౌరులకు ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. పౌరుల రాజ్యాంగ విధులే బలమైన ప్రజాస్వామ్యానికి పునాదులని పేర్కొన్నారు. బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు సందేశమిస్తూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఓటుహక్కును వినియో గించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు.
తొలిసారి ఓటుహక్కును పొందిన 18 ఏళ్ల యువతను సత్కరిస్తూ పాఠశాలలు, కాలేజీల్లో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రధాని పిలుపునిచ్చారు. బాధ్యతలను నిర్వర్తించే వైఖరి నుంచే హక్కుల ప్రవాహం జరుగుతుందని మహాత్మాగాంధీ విశ్వసించారని తెలిపారు. ప్రజలంతా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తేనే సామాజిక, ఆర్థిక వికాసానికి పునాదులు పడతాయని భారత జాతిపిత చెప్పేవారని గుర్తుచేశారు.
మహామహులు రచించిన గ్రంథం
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేద్కర్ వంటి ఎంతోమంది మహానుభావులు భారత రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారని మోదీ కొనియాడారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, బిర్సా ముండా, మహాత్మా గాంధీ చేసిన త్యాగాలు ఎనలేనివన్నారు.
ఆ మహోన్నతులను తలచుకోగానే రాజ్యాంగ విధులు గుర్తుకొస్తాయని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏలో ప్రత్యేకంగా ప్రాథమిక విధుల ప్రస్తావన ఉందని ప్రధాని చెప్పారు. సమష్టిగా సామాజిక, ఆర్థిక వికాసాన్ని సాధించే మార్గాలపై ఈ విధులు దిశానిర్దేశం చేస్తాయన్నారు.
రాజ్యాంగం వల్లే ప్రధాని అయ్యాను
‘భారత రాజ్యాంగం వల్లే నేను దేశ ప్రధాని అయ్యాను. నేనొక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. ఆర్థికంగా మా కుటుంబం పరిస్థితి అంతంతే. అయి నా నేను గత 24 ఏళ్లుగా దేశ ప్రజలకు సేవ చేయగలుగుతున్నాను. నాకు బాగా గుర్తుంది, 2014లో తొలిసారి పార్లమెం టు భవనంలోకి అడుగుపెట్టేటప్పుడు వినమ్రంగా వంగి మెట్లకు మొక్కాను. ఎందు కంటే అది ప్రజాస్వామ్య దేవాలయం.
2019లో పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా నేను వినమ్రంగా వంగి నుదుటి తో భారత రాజ్యాంగ గ్రంథాన్ని తాకి నమస్కారాలు సమర్పించాను. నాలాంటి ఎంతోమందికి ఎన్నో అవకాశాలను భారత రాజ్యాంగం ఇచ్చింది. నా లాంటి వాళ్లకు కలలు కనే శక్తిని, ఆ దిశగా పనిచేసేలా బలాన్ని రాజ్యాంగమే ప్రసాదించిం ది’ అని ప్రధాని మోదీ తెలిపారు.