06-01-2026 12:54:51 AM
హైదరాబాద్ యువతి నికిత హత్య కేసు
చెన్నై/న్యూయార్క్: హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గొడిశాల నికితారావు (౨౭) గత నెల ౩౧న అమెరికాలోని మేరీల్యాండ్‌లో కత్తిపోట్లకు గురై హత్యకు గురైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు కీలక మలుపు తీసుకున్నది. నికితను హతమార్చింది తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మేనని అక్కడి పోలీసులు తేల్చారు. నికితను హత్య చేసిన తర్వాత అజయ్ శర్మ ఈనెల ౨న నికిత ఆచూకీ తెలియడం లేదని పోలీసులకు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు హుటాహుటిన విమానంలో భారత్‌కు పలాయనం చిత్తగించాడు.
తన స్వస్థలమైన తమిళనాడుకు చేరుకున్నాడు. మేరీల్యాండ్ పోలీసులు మాత్రం హత్య కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. దీనిలో భాగంగానే అజయ్‌శర్మపై అనుమానంతో తన గదిని సోదా చేశారు. పోలీసులు ఆ గదిలో నికిత మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు, భారత అధికారుల సమన్వయపరిచి ఇంటర్ పోలీసులను అప్రమత్తం చేశారు. సోమవారం ఇంటర్‌పోల్ పోలీసులు నిందితుడు అర్జున్ శర్మను తమిళనాడు రాజధాని చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు.
హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు
నికితారావు హత్య వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు మృతురాలి సోదరి సరస్వతి ఆరోపిస్తున్నారు. ఈమేరకు ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ‘నికితను హత్యచేయడానికి కొద్దిరోజుల ముందు అర్జున్‌శర్మ ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.3.16 లక్షలను తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. అంతకుముందు నికిత కుటుంబం నుంచి మరో రూ.4.7 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఈనెల 2న కూడా తనకు మరో వెయ్యి డాలర్లు ఇవ్వాలని సరస్వతిని కోరాడు.
అందుకు సరస్వతి నిరాకరించింది. అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకే అర్జున్‌శర్మ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు’ అంటూ సరస్వతి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె కొలంబియాలోని వేద హెల్త్ సంస్థలో డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆమె తాను పనిచేస్తున్న సంస్థ నుంచి ఉత్తమ ఉద్యోగిని అవార్డు అందుకున్నారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారు.