06-01-2026 12:54:26 AM
ఆలయంపై మొదటి దాడి జరిగి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రకటన
న్యూఢిల్లీ, జనవరి 5: భారత ఆత్మకు ప్రతీక గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయమని అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆలయంపై మహమ్మద్ గజనీ చేసిన మొదటి దాడికి వెయ్యేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తాజాగా ప్రధాని ఓ ప్రకటన విడుదల చేశారు. 1026 జనవరిలో ఈ దాడి జరిగిందని, భారతీయ సంస్కృతిని ధ్వంసం చేయడం నాడు గజనీ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. పరాయి పాలకులు ఎన్నిసార్లు హిందువుల ఆలయాలను కూల్చేసినా భారతీయులు మళ్లీ వాటి జీర్ణోద్ధరణ చేపట్టారని కొనియాడారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆలయ పునర్నిర్మాణంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ పాత్ర పోషించారని కొనియాడారు. 1951 మే 11న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆలయాన్ని పునః ప్రారంభించారని గుర్తుచేశారు. ఆలయానికి పునఃవైభవం కల్పించడం నాటి ప్రధాని నెహ్రూకు ఇష్టం లేదని, అయినప్పటికీ పటేల్ దృఢ సంకల్పంతోనే హిందువుల కల సాకారమైందని పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడిగా తాను ఆలయ కార్యకలాపాల్లో భాగస్వామిని కావడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు.