calender_icon.png 3 July, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షరాలతో అగ్గి మండించిన చెరబండరాజు

02-07-2025 12:00:00 AM

నేడు చెరబండరాజు వర్ధంతి :

‘నా దేశ ప్రజలే నా కవితా వస్తువులు. దిగంబర కవితోద్యమం నా కవితావేశానికి వేదిక కల్పించింది. వెన్నెముక ఇచ్చి నిలబెట్టింది. మార్క్సిస్ట్ శాస్త్రీయమైన అవగాహన నా కవితాధ్యేయానికి స్పష్టతను ఇచ్చింది. నా అయిదుగురు మిత్రులతో కలిసి అహోరాత్రులు ప్రపంచాన్ని చుట్టి వచ్చిన క్షణాలు నాకెంతో విలువైనవి. వచ్చిన విమర్శలూ, పొగడ్తలూ నా దృష్టిని పటిష్టం చేశాయి. చేస్తున్నాయి. 

‘పుడమితల్లి చల్లని గుండెను

పాయలు పాయలుగా చీల్చుకుని

కాల్వలై ఎవరిదో, ఏ తరం కన్నీరో

గలగలా సుడులు తిరిగి

మెల్లగా పారుతుంది..’ అని.. గొంతెత్తిన దిగంబర కవుల్లో ఒకడైన చెరబండరాజు తెలుగు సాహిత్య రంగంపై చెరగని ముద్ర వేశాడు. ‘విప్లవాల యుగం మనది. విప్లవి స్తే జయం మనది’, ‘ఈ మట్టిని తొలుచుకుని విప్లవాలు లేస్తున్న ఎరుపెక్కిన ఈ మట్టికి మా నెత్తుటి స్వగతాలు’ అని నినదించిన విప్లవ కవి ఆయన. ‘దేశమేదైతే నేం? మట్టంతా ఒక్కటే.. అమ్మ ఎవరైతే నేం? చనుబాల తీపి ఒక్కటే” అని నినదించిన మానవతావాది.

ఇతర దిగంబర కవులు మానేపల్లి హృశికేశవరావు (నగ్నము ని), యాదవరెడ్డి (నిఖిలేశ్వర్) కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు (మహాస్వప్న), వీరరాఘవాచార్యులు, మన్మోహన్ సహాయ (భైర వయ్య)తో కలిసి ముద్రించిన ‘దిగంబర కవిత్వం’ అనే పుస్తక సంకలనం 1960 లలో ఒక సంచలనం. ఆ కవితల సంకలనంలో చెరబండరాజు కవితలు ప్రత్యేకంగా ఉంటాయి. చెరబండరాజు 1944లో మే డ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం అంకుషాపూర్‌లో అంత్యత నిరుపేద కుటుంబంలో పుట్టాడు.

ఆయనకు తల్దిదండ్రులు పెట్టిన పేరు బద్దం భాస్కరరెడ్డి.  విద్యాభ్యాసం తర్వాత తొలిరోజుల్లో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తర్వాత సాహితీరం గంలోకి ప్రవేశించాడు. పేదరికం, ఆకలి బాధలపై ఆయన రాసిన ‘నన్నెక్కనివ్వండి బోను’, ‘వందేమాతరం’ గేయాలు నాడు ఒక సంచలనం. మొత్తం దిగంబర కవిత్వ సంకలనంలోనే ‘నన్నెక్కనివ్వండి బోను’ అనే గేయం ప్రఖ్యాతి సాధించింది. 

1970 లలో దిగంబర కవులు ఎవరికివారు వేరైన తర్వాత చెరబండరాజు విప్లవ రచయితల సంఘం (విరసం)వైపునకు మొగ్గాడు.  1991-72లో విరసం వ్యవస్థాపక కార్యవ ర్గ సభ్యుడిగా, కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించాడు.  దిగంబర కవిత్వం కాక ఆయన రచనలు ‘దిక్సూచి’, ‘ముట్టడి’, ‘గమ్యం’, ‘కత్తిపాట’కు మంచి పాఠకాదరణ లభిం చింది.

ఒక్క కవితా ప్రక్రియ పైనే కాక ఆయనకు నవలా ప్రక్రియపైనా అభినివేశం ఉంది. ఆ తృష్ణతోనే ఆయన ‘మాపల్లె, ‘ప్రస్థానం’, ‘నిప్పురాళ్లు’, ‘గంజినీళ్లు’ అనే నవ లు రాశారు.  ఆయన అవార్డులు, రివార్డు ల కోసం ఎప్పుడూ ఆశపడలేదు. ఒక్కసా రి మాత్రం ‘దిక్సూచి’ సంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు అనేఅవార్డు ప్రకటించింది. 

శ్రీశ్రీతో ప్రత్యేక అనుబంధం..

మహాకవి శ్రీశ్రీతో చెరబండరాజుకు ప్రత్యేక అనుబంధం ఉండేది. శ్రీశ్రీ కూడా ఆయన్ను ఎంత ఇష్టపడేవాడు. విప్లవ కవితోద్యమంలో చెరబండరాజును తన సహ చరుడిగా భావించేవాడు. చెరబండరాజు సాహిత్య ఉద్యమాల్లో చురుగ్గా పాల్లొనేవాడు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన విప్లవోద్యమాలు, విద్యార్థి, యువజన ఉద్యమాలు, జన నాట్యమండలికి పెద్ద దిక్కుగా నిలిచాడు.

కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా సంచరించేవాడు. ఆయ న ఉపన్యాసాలు వినేందుకు వందలాది విద్యార్థులు సభలకు వెళ్లేవారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, రాడికల్ స్టూడెం ట్ యూనియన్ సభ్యులకు ఆయన వెన్నెముకగా నిలిచాడు. ఆయా సంఘాల నేత లు ఎక్కడ సభలు పెట్టినా చెరబండరాజు ను ఆహ్వానించేవారు.  శ్రీకాకుళం వసంత మేఘ గర్జన, కరీంనగర్, ఆదిలాబాద్, ము లుగులో భూపోరాటాలు ఆయన్నెంతో ఆకర్షించాయి.

అందుకే కవితా వస్తువుగా ఆయన  ప్రజా పోరాటాలనే ఎంచుకున్నా రు. తన కవిత్వంలో ప్రజాపోరాటాల స్ఫూర్తి కచ్చితంగా కనిపించేది. అందుకే ప్రఖ్యాత రచయిత (కేవీఆర్) కేవీ రమణారెడ్డి ‘చెరబండరాజు వజ్రం కంటే దృఢమైనవాడు’ అని శ్లాఘించాడు. ‘చెరబండరాజు కవిత్వం కత్తికంటే పదునుగా ఉంటుంది. అగ్నిని భుజించేవారి నుంచే అలాంటి కవిత్వం జనిస్తుంది’ అని కొనియాడాడు. 

నిరంతర అధ్యయన శీలి..

చెరబండరాజుకు తెలుగు సాహిత్యంపై ఎనలేని మమకారం ఉండేది. చిన్నప్పటి నుంచే ఆయన ప్రాచీన ప్రబంధాలు, గ్రంథాలు అధ్యయనం చేశాడు. కవిత్వంపై విద్యార్థులకు పాఠాలు చెప్తూ అద్భుతమైన వాగ్ధాటిని ఒడిసిపట్టారు. వచన కవిత్వంపై సాధికారత సాధించాడు.

తన పద్యాలను తానే తన గాత్రంలో వినిపించేవాడు. దుర్భరమైన పేదరికం, వెన్నాడుతున్న ఆర్థిక సమస్యలకు ఆయనెప్పుడూ వెరవలేదు. జీవితం పట్ల ఆయన నిరాశ చెందలేదు. తాను పనిచేస్తున్న  విద్యాసంస్థ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించినా, అనారోగ్యం చుట్టుముట్టినా ఆయన తన కలాన్ని పక్కన పెట్టలేదు. 

మూడుసార్లు జైలు జీవితం..

1971-77 వరకు ఆయన మూడుసార్లు జైలులోనే ఉన్నారు. 1971లో ప్రివెం టివ్ డిటెన్షన్ చట్ట ప్రకారం నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు అరెస్టయ్యా రు. వారిని డిటెన్షన్ చేయాల్సిన అవసరం లేదని, భావ ప్రకటనా స్వేచ్ఛ వారికుందని నాడు న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో వారు బయటకు వచ్చారు.

1975 ఏప్రిల్ లో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన తెలుగు మహాషభలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి శ్రీశ్రీతో పాటు చెరబండరాజు అరె స్టయ్యాడు. జైలులో ఉంటూ కోర్టు ట్రయల్స్‌కు హాజరవుతున్న సమయంలో చెరబండరాజు సంకెళ్ల దరువుతోనే పాటలు పాడేవాడు. తన ధిక్కారాన్ని వినిపిస్తున్నానని చెప్పేవాడు. జైలులో ఉన్న సమయంలో ఆయన  ఆరోగ్యం క్షీణించిం ది. బ్రెయిన్ ట్యూమర్ సమస్య ఆయన్ను జీవితకాలం వెంటాడింది.

చివరి రోజుల్లో ఆరోగ్యపరంగా ఆయన తీవ్రమైన సమస్యలు ఎదు ర్కొన్నాడు. చివరకు 2 జూలై 1982లో కన్నుమూశాడు. తాను కేవలం 38 ఏళ్లు మాత్రమే జీవించి, నాటి తరం కవులు, రచయితలు, విప్లవకారులకు దశాబ్దాలకు సరిపడా స్ఫూర్తినిచ్చారు. చెరబం డరాజు మరణించిన మూడేళ్ల తర్వాత 1985లో ‘ఆల్ ఇండియా రెవల్యూషనరీ కల్చరల్ కమిటీ’ ఆయన కవితల ఆంగ్లానువాదాన్ని అచ్చేసింది. అదే సంస్థ  2003 లో ‘చెరబండరాజు సాహిత్య సరస్వం’ పేరిట ఆయన రచనలను ప్రచురించింది.

తన కవితావేశానికి ప్రేరణ..

‘నా దేశ ప్రజలే నా కవితా వస్తువులు. దిగంబర కవితోద్యమం నా కవితావేశానికి వేదిక కల్పించింది. వెన్నెముక ఇచ్చి నిలబె ట్టింది. మార్క్సిస్ట్ శాస్త్రీయమైన అవగాహ న నా కవితాధ్యేయానికి స్పష్టతను ఇచ్చిం ది. నా అయిదుగురు మిత్రులతో కలిసి అహోరాత్రులు ప్రపంచాన్ని చుట్టి వచ్చిన క్షణాలు నాకెంతో విలువైనవి.

వచ్చిన విమ ర్శలూ, పొగడ్తలూ నా దృష్టిని పటిష్టం చేశాయి. చేస్తున్నాయి. సమాజంలోని కొత్త రక్తాన్ని ఆహ్వానించి గ్రహిస్తూనే ఉన్నాను. ఏం రాశాను అనే దాని కన్నా.. ఏం రాయా లి అనే, ఎవరికోసం రాయాలి అనే, ఎందు కు రాయాలి.. అనే సమస్య నాకీనాడు లేదు.’ అని చెరబండరాజు ప్రకటించు కున్నాడు. 

 రతన్ రుద్ర

వ్యాసకర్త సెల్: ౭౮౪౨౧౯౫౭౫౫