02-07-2025 12:00:00 AM
పాశమైలారంలోని రసాయన కర్మాగారంలో సోమవారం ఉదయం సంభవించిన భారీ విస్ఫోటం పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు మరోసారి ప్రశ్నార్థకమయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో భారీ పేలుడు, అగ్నికీలలకు కార్మికుల ప్రాణాలు బుగ్గిపాలయ్యాయి. ప్రమాదం జరిగి 24 గంటలైనా.. కొందరి కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు.
తమ వాళ్లు ఏమయ్యారో తెలియక కార్మికుల కుటుంబాల సభ్యుల గోసం వర్ణనాతీతం. హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామి క వాడల్లో కార్మికుల ప్రాణాలు గాలిలో పెట్టిన దీపాలుగా మారాయి. కొన్ని పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దీనికి కారణమవు తున్నది. కర్మాగారాల్లో ప్రమాదాలకు కార్మికులు బలవుతున్నారు. వీరి లో ఎక్కువ మంది పొట్టచేత పట్టకుని వివిధ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన శ్రమజీవులే.
సిగాచి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో డ్రైయర్ పేలుడు వల్ల ఈ ఘోరం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రియాక్టర్లు, డ్రైయర్లు పేలవ డం వల్ల తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో మూడేళ్లలో ఇలాంటి ప్రమాదంలో దాదాపు 25 మంది మరణించారు. అనేక మంది కార్మికులు గాయపడ్డారు. పాశమైలారం, పటాన్‌చెరు ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి.
డ్రైయర్లు, రియాక్టర్లు పేలిపోతుండటం సర్వసాధారణంగా మారినా, ఈ దుర్ఘటనలను నివారించడానికి, కార్మికుల ప్రాణాల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. కార్మికశాఖ నివేదికల ప్రకారమే, రాష్ట్రంలో ప్రమాదకరమైన ఫ్యాక్టరీల్లో దాదాపు 50 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.
సిగాచి ఫ్యాక్టరీలో గత డిసెంబర్‌లోనే కర్మగారాల శాఖ తనిఖీలు జరిపింది. అక్కడి ప్రమాణాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిం ది. కాంట్రాక్టర్ల ద్వారా తక్కు వ వేతనాలకు కార్మికుల వేతనాలకు కార్మికులను నియమించుకోవడమే కాక ఫ్యాక్టరీల లక్ష్యంగా మారింది.
కర్మాగారాల్లో, ముఖ్యంగా రసాయన, ఔషధ పరిశ్రమల్లో తగిన నైపుణ్యంలేని కార్మికులను సైతం నియమించుకుంటున్నారు. ఉపాధి కోసం భార్యాపిల్లలతో రాష్ట్రానికి వచ్చే బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ కార్మికులతో కాంట్రాక్టర్లకు కాసుల పంట పండుతున్నది. అలా పొట్టచేత పట్టుకుని వలస వస్తున్న కార్మికులకు తగిన నైపుణ్యం ఉందా లేదా అనేది కూడా కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు.
అటు కొన్ని ఫ్యాక్టరీల నిర్వహణ లోపం, ఇటు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల శ్రమజీవుల ప్రాణాలు బుగ్గిపాలవుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అనేక రంగాల్లో లక్షలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారు.
వారికి కార్మిక చట్టాలపై అవగాహన అంతంత మాత్రమే. ప్రమాదకరమైన పని ప్రాంతాల్లో ప్రాణాలను ఫణంగా పెట్టి వారు పనిచేయాల్సి వస్తున్నది. ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం నిఘా నేత్రాలు తెరిచి ఉంచకపోతే ఇలాంటి దుర్ఘటనలు ఆగేవి కావు.