భూ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం (జైపూర్), జూలై 2 : భూ సర్వే ప్రక్రియ జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. గురువారం భీమారం మండలం మద్దికల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తహసిల్దార్ సదానందంతో కలిసి హాజరై మాట్లాడారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను చూసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
గ్రామంలోని భూములకు హద్దులు నిర్ధారించడం వల్ల గ్రామానికి సంబంధించిన భూమి స్పష్టత వస్తుందని, ప్రభుత్వ భూములు సైతం నిర్ధారణ అవుతాయన్నారు. పట్టా కలిగి ఉండి మోకాపై లేకపోవడం, మోకాపై ఉండి పట్టా కలిగి ఉండకపోవడం అంశాలపై ప్రత్యేక కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు.
భూ సర్వే సమగ్రంగా నిర్వహించి మ్యాపింగ్ చేయడం జరుగుతుందని, మ్యాపింగ్ పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని, సర్వేయర్లకు ప్రజలు సహకారమందిస్తే సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి పాఠశాలల్లోని తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.






