calender_icon.png 6 September, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్, రష్యాను కోల్పోయాం

06-09-2025 01:35:12 AM

-చైనా చీకటి కుహరంలోకి ఆ రెండు దేశాలు

-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

-భారత్, రష్యా, చైనాలకు ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆకాంక్ష

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: భారత్, రష్యా దేశాలను చైనాకు కోల్పోయినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘భారత్, రష్యాలను చైనాకు కోల్పోయినట్టే కనిపిస్తోంది. ఆ రెండు దేశాలు చైనా చీకటి కుహరంలోకి వెళ్తున్నాయి. రష్యా, భారత్, చైనా దేశాలకు ఉజ్వల భవిష్యత్ ఉండాలి’ అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్య మం ట్రూత్‌లో ప్రకటించారు.

ఇటీవల చైనా లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు (ఎస్‌సీవో)లో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ చర్చలు జరిపారు. సదస్సు సందర్భంగా ఈ ముగ్గురు నేతలు కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన ట్రంప్ పై విధంగా వ్యాఖ్యానించారు. అమెరికా విధిస్తున్న సుంకాలపై కూడా ఈ ముగ్గురు నేతలు ఎస్‌సీవో వేదికగా చర్చించినట్టు తెలుస్తోంది. ట్రంప్ ఈ విధంగా కామెంట్ చేయడంతో ఈ దేశాల మధ్య సంబంధాలు కుదిరినట్టే అని అర్థమవుతుంది. చైనా ప్రభావం తగ్గించేందుకు ఎన్నో దశాబ్దాలుగా అమెరికా భారత్‌ను అవకాశంగా భావించింది.

అమెరికాలో రిపబ్లికన్లు అధికారంలో ఉన్నా, డెమోక్రాట్లు అధికారంలో ఉన్నా భారత్‌లో పెట్టుబడులు పెట్టారు. ట్రంప్ మొదటి సారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా భారత్‌తో మంచి సంబంధాలే కొనసాగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ సంబంధాలకు సుంకాలు అడ్డుగోడలా మారాయి. ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. మిత్రదేశంగా ఉన్న భారత్ తమకు దూరం అయిందని ట్రంప్ చేసిన కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.