calender_icon.png 27 July, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రావణ శనివారాలే స్వామివారి దర్శనభాగ్యం!

27-07-2025 12:00:00 AM

  1. వేల అడుగుల ఎత్తులోభూదేవి, శ్రీదేవి సమేత!
  2. తిరుమలయ్య గుట్టపై కొలువుదీరిన తిరుమలనాథుడు
  3. తొలి శనివారం అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణం
  4. వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో కొంగుబంగారంగా శ్రీనివాసుడు
  5. ఆధ్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణంలో ఆలయం

* సాధారణంగా హిందూ దేవాలయాలు ఏడాది పొడవునా ఉదయం, సాయంత్రం భక్తులకు అందుబాటులో ఉంటూ నిత్య పూజలను అందుకోవడం తెలిసిందే. కానీ సంవత్సరంలో శ్రావణమాసంలోని శనివారాలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తున్న ఆలయం వనపర్తి చిట్టడవిలో వేల అడుగుల ఎత్తున కొండపై భూదేవి, శ్రీదేవి సమేత కొలువుదీరిన తిరుమలనాథ స్వామి తిరుమలయ్య గుట్ట తిరుమలనాథుని ప్రత్యేకత. 

వనపర్తి, విజయక్రాంతి : వనపర్తి జిల్లా కేంద్రానికి అతి సమీపం లోని చిట్టడవిలో 7 గుట్టల మధ్యలో కొండశిఖరంపై కొలువుదీరిన భూదేవి, శ్రీదేవీ స మేత శ్రీ తిరుమలనాథస్వామి శతాబ్దాలుగా భక్తులకు కోరిన కోర్కెలు తీర్చుతూ కొంగుబంగారంగా భాసిల్లుతున్నారు.

శ్రీ తిరుమలనాథస్వామిని దర్శించుకునేందుకు, దాసంగాలు సమర్పించేందుకు జిల్లాతో పాటు గద్వాల, మహబూబ్‌నగర్, కర్ణాటకలోని రాయచూ రు, బళ్లారి,ఉబ్లి తదితర ప్రాం తాల వారు గుట్టకు వస్తుంటారు. కర్ణాటక ప్రాంత వాసు లు ఇక్కడికి వచ్చే స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటారు. శ్రావణ మాసంలోని ప్రతీ శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటారు.

సంస్థానాధీశుల కాలంలో ఆలయం ఏర్పాటు..

వనపర్తి సంస్థానాధీశుల కాలంలో కవులను, కళాకారులను ప్రోత్సహిస్తూ అద్భుతమైన కట్టడాలను నిర్మించి తమ సంస్థానాదిశ పరిధిలో పలు ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దినట్లు చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో సుమారు 300 ఏళ్ల క్రితం ఈ కొండపై స్వామి అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించి ఈ ప్రాంత ప్రజలకు ఏటా శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించేలా.. పశువుల కాపరులు, అడవితల్లిని నమ్ముకుని జీవించి ముదిరాజ్‌లు దాసంగాలు సమర్పించి చల్లంగ చూడాలని మొక్కులు తీర్చుకునే సాంప్రదాయాన్ని నెలకొల్పారు.

వనపర్తి పట్టణం నుంచి పెబ్బేరు పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారిలోని ఐదు కిలోమీటర్ల దూరంలో స్వామి ఆలయ ముఖద్వారం ఉంటుంది. అక్కడే ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం చేశారు. శతాబ్దాల క్రితం వనపర్తి సంస్థానాధీశులు వేటకు వెళ్లినప్పుడు ఎత్తున కొండ ప్రాంతం, ఆహ్లాదకరమైన వాతావరణం, వేలాది అడుగుల ఎత్తున విశాలమైన రాతిచాప, అక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన కొనేరు(నీటికొలను) ఉండటం చూసి శిఖరాగ్రాన స్వామి వారి మూర్తిని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుని ఏకశిలపై స్వామి అమ్మవార్ల విగ్రహాన్ని తయారు చేయించి గుంట్ల మధ్యన శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చేసినట్లు చరిత్ర చెబుతోంది. 

శ్రావణ మాస శనివారాలే దర్శనం..

ఏటా శ్రావణ మాసంలోని శనివారాల్లో ఇక్కడికి భక్తులు వచ్చి పూజలు చేసేలా అనాదిగా వస్తున్న ఆచారం నెలకొంది. వనపర్తి మండలంలోని కడుకుంట్ల గ్రామానికి చెందిన కొందరిని ఆలయానికి దర్మకర్తలుగా పెద్దగూడెంలోని ఓ ముదిరాజ్ కుటుంబాన్ని పూజలు చేసేందుకు  నియమించారు. నాటి నుంచి నేటి వరకు ఆయా కుటుంబాల వారే స్వామివారిని సేవించుకుంటూ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. 

తాటిచెట్టు మెట్ల నుంచి కాంక్రీట్ మెట్లవరకు..

మొదట్లో గుట్టపై నుంచి స్వామివారు కొలువుదీరిన శిఖరాగ్రానికి చేరుకునేందుకు సంస్థానాధీశులు తాటిచెట్ల కాండంతో మెట్లను ఏర్పాటు చేసినట్లు భక్తులు చెప్తారు. 1993 ప్రాంతంలో దాతల సాయంతో ఇనుప మెట్లను,  ఇటీవల కాంక్రీట్ మెట్లను ఏర్పాటు చేశారు. శ్రీరంగాపురం రంగనాయకస్వామి, పెద్దగూడెం గ్రామంలోని కోదండరామస్వామి ఆలయాలతో పాటు తిరుమలనాథ స్వామి ఆలయాన్ని సంస్థానాధీశులు విగ్రహ ప్రతిష్ఠలు చేయించి పూజలు చేసేవారు. 

బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు.. 

గతంలో బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు తాత్కాలిక రోడ్డు వేసేవారు. ప్రస్తుతం నల్లతాచును పోలిన తారురోడ్డును ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి హయాంలో నిర్మాణం చేశారు. ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్టీసీ జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. 

సంజీవని గుట్టగా.. 

భూదేవి, శ్రీదేవి అమ్మవార్ల సమేత శ్రీతిరుమలనాథ స్వామి కొలువుదీరిన కొండపై ఎన్నో ఔషధ మొక్కలు  ఉండటంతో ఈ గుట్టను సంజీవని గుట్టగా పలుకుతారు. ఏటా శ్రావణ మాసంలో అప్పటికే కురిసిన వర్షాలకు పచ్చనిచెట్లు, ఎన్నోరకాల ఔషధ మొక్కలతో చేతులకు అందేంత ఎత్తులో వెళ్తున్న మేఘాలు.. చల్లని జల్లులతో ఎంతో ఆహ్లాదకరమైన వాతారణంలో స్వామివారిని దర్శించుకుని అక్కడే  నిర్వహించే జాతరను తిలకించి ఆ వాతావరణాన్ని అస్వాదించేందుకు భక్తులు ఎంతగానో ఇష్టపడతారు.

తొలి శనివారం స్వామివారి కల్యాణం.. 

శ్రావణ మాసం వచ్చే తొలి శనివారం గుట్టపై స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు కల్యాణ మహోత్సవం చేస్తారు. సామాన్యుల నుంచి కోటీశ్వరులు సైతం ఒకేచోట నేలపై కూర్చొని స్వామి అమ్మవార్లకు కల్యాణం చేయిస్తారు. భక్తుల చేతుల మీదుగానే కల్యాణ మహోత్సవం నిర్వహించటం ఆనవాయితీ.