calender_icon.png 27 July, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలపాతాల సవ్వడి

27-07-2025 12:00:00 AM

అదిలాబాద్, విజయక్రాంతి : అడవుల జిల్లా ఆదిలాబాద్ ప్రకృతికి పుట్టినిల్లు. దట్టమైన అడవి, ఎత్తున కొండలపై నుంచి పరవళ్లు తొక్కుతూ జాలువారే జలపాతాలు.. పచ్చదనం పరుచుకున్న ప్రకృతి సోయగాలు.. పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను ఇట్టే కట్టిపడేస్తాయి. ఆదిలాబాద్ జిల్లాలో అబ్బురపర్చే సహజసిద్ధమైన ఎన్నో జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

రాష్ట్రంలోనే ఎత్తున జలపాతాల్లో ఒకటైన తెలంగాణ నయాగారాగా గుర్తింపు పొందిన కుంటాల జలపాతం పర్యాటకులను రారమ్మని పిలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎత్తున కుంటాల జలపాతంతో పాటు సాహస క్రీడలకు నెలవైన గాయత్రీ జలపాతం, దట్టమైన అడవుల మధ్య పొచ్చెర జలపాతం, కొండలు కోనల మధ్య కనకాయి జలపాతం, ఎత్తున ఖానాపూర్ ఘాట్ తర్వాత కనబడే ఖండాల జలపాతం, ఇలాంటి ఎన్నో జలపాతాలు ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో పరవళ్లు తొక్కుతూ ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

కుంటాల జలపాతం..

రాష్ట్రంలోని ఎత్తున కుంటాల జలపాతానికి చేరుకోవాలంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేరడిగొండ మండలానికి జాతీయ రహదారి 44 మీదుగా ప్రయాణించి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కుడివైపునకు దట్టమైన అటవీ ప్రాంతం గుండా మరో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే కుంటాల జలపాతానికి చేరుకోవచ్చు.

50 అడుగుల ఎత్తు నుంచి  జాలువారుతూ పరవళ్లు తొక్కుతోంది. 430 మీటర్లు కిందికి దిగితే తప్ప ఈ జలపాతాన్ని చూడలేము. వందల మెట్లను దిగుతూ కిందికి చేరుకోవడంతో ప్రకృతి సోయగాల మధ్య జాలువారి జలపాతాన్ని చూస్తే మెట్లు దిగిన ఇబ్బందులను సైతం ప్రకృతి ఒడిలో మైమరిచిపోతాం. 

పొచ్చెర జలపాతం..

దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే పొచ్చెర జలపాతానికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి 44 జాతీయ రహదారిపై 260 కిలోమీటర్ల ప్రయాణించి వస్తే బోథ్ మండలం ఎక్స్ రోడ్ కు చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఎడమ వైపు దారిలో మరో ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే జలపాతానికి చేరుకోవచ్చు.

గాయత్రి జలపాతం..

సాహస క్రీడలకు నిలయమైన గాయత్రి జలపాతం వద్ద జాతీయ స్థాయి వాటర్ ఫాల్ రా ఫెల్లింగ్ పోటీలు జరుగుతాయి. గతంలో నిర్వహించిన ఈ పోటీలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. ఇచ్చోడ మండలంలోని గాయత్రి జలపాతానికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి 275 కిలోమీటర్లు 44వ జాతీయ రహదారి మీదుగా ప్రయాణించి ఇచ్చోడ మండలానికి చేరుకొని, అక్కడి నుంచి కుడివైపునకు సిరిచేల్మా గ్రామం వైపు మరో 15 కిలోమీటర్లు అటవీ ప్రాంతం గుండా ప్రయాణిస్తే గాయత్రి జలపాతానికి చేరుకోవచ్చు.  

కనకాయి జలపాతం..

బజార్హత్నూర్ మండలంలోని కనకాయి జలపాతానికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి 44వ జాతీయ రహదారిపై ప్రయాణించి ఇచ్చోడ మండల కేంద్రానికి చేరుకొవాలి. అక్కడి నుంచి బజార్హత్నూర్ మండలానికి వెళ్లే దారి గుండా మరో 9 కిలోమీటర్లు  ప్రయాణిస్తే కనకాయి జలపాతానికి చేరుకోవచ్చు. 

ఖండాల జలపాతం..

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాల జలపాతానికి వెళ్లాలంటే హైదరాబాదు నుంచి 44వ జాతీయ రహదారి మీదుగా 300 కిలోమీటర్లు ప్రయాణించి జిల్లా కేంద్రానికి చేరుకోవాలి. అక్కడి నుంచి  20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తున ఖండాల ఘాట్‌కు చేరుకొని అక్కడి నుంచి ఖండాల జలపాతానికి వెళ్లవచ్చు.