calender_icon.png 27 July, 2025 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైజాగ్ కాలనీ సొగసు చూడతరమా!

27-07-2025 12:00:00 AM

  1. ప్రకృతికి కేరాఫ్ అడ్రస్ వైజాగ్ కాలనీ 
  2. పర్యాటక కేంద్రంగా ఆకట్టుకుంటున్న ఐలాండ్
  3. రెండు కళ్లకు అందని సాగర్ బ్యాక్ వాటర్ అందాలు 
  4. పచ్చని ప్రకృతిలో టూరిస్టుల పరవశం

నాగార్జునసాగర్, విజయక్రాంతి : నాగార్జునసాగర్ అనగానే డ్యామ్, బోటింగ్, నాగార్జునకొండ తదితర ప్రదేశాలు గుర్తుకొస్తాయి. కానీ వాటితో పోటీపడుతూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న మరో ప్రదేశం ఉంది అదే ‘వైజాగ్ కాలనీ’. ఏపీలోని విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చిన మత్స్యకారులు చేపలను వేటాడటం కోసం ఏర్పరచుకున్న నివాస స్థలం ఈ కాలనీ.

సాగర్‌కు 40 కిలోమీటర్లు, దేవరకొండకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం అందమైన ప్రకృతికి నెలవు. తాజా చేపల పులుసు, నాగార్జునసాగర్ అనగానే గుర్తుకు వచ్చేది.. ప్రపంచ పర్యాటక కేంద్రం. ఇప్పుడు నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. సాగర్ బ్యాక్ వాటర్ వెనక దాగి ఉన్న ప్రాంతమే వైజాగ్ కాలనీ. ప్రకృతి అందాలు ఈ ప్రాంతం సొంతం. అంతేకాదు చేపలు, నాటు కోడికూర రుచులకు, జొన్న రొట్టెలకు ప్రత్యేకమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది.

  సాగర తీరం సంధ్యా సమయం

పర్యాటకులు సాగర తీరంలో సేదతీరుతూ పచ్చని కొండల నడుమ ఆనందంగా ప్రకృతిని ఆస్వాదించొచ్చు. నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ తో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వైజాగ్ కాలనీ పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రాంతమంతా పచ్చదనంతో కనువిందు చేసే కొండల నడుమ గిరిజన తండాలు కనిపిస్తుంటాయి.

ఇక్కడి ప్రకృతి అందానికి పర్యాటకులు పులకించిపోతారు. దీంతో సెలవు దినాల్లో హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వైజాగ్ కాలనీ అందాలను తిలకించేందుకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు స్థానిక మత్స్యకారుల కుటుంబాలు భోజన ఏర్పాట్లు చేస్తారు.

పర్యాటకులకు అవసరమైన తాజా చేపలు వంటకాలను తయారు చేస్తారు. ఇక్కడ చేపల పులుసు, చేపల ఫ్రై వంటకాలు టూరిస్టులకు వండి పెడుతుంటారు. సాయంత్రం సమయమంలో బ్యాక్ వాటర్ అందాలను ఆస్వాదిస్తూ కొండల నడుమ సూర్యస్తమయాన్ని చూస్తూ ఎనలేన అనుభూతిని పొందవచ్చు.

బ్యాక్‌వాటర్ అలలపై అలా అలా..

నాటుపడవలు, మర బోట్ల ద్వారా టూరిస్టులను సాగర్ జలాశయం అలలపై జాలీగా ట్రిప్పులు తిప్పుతుంటారు. బోట్లలో సాగర్ అలలపై ప్రయాణిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తుంటారు. వేసవికాలంలో సాగర్ రిజర్వాయర్‌లో నీటిమట్టం తక్కువగా ఉన్నప్పుడు ఐల్యాండ్‌లు కనిపిస్తుంటాయి. ఐల్యాండ్‌లు చూసి పర్యాటకులు ముగ్ధులవుతున్నారు. ఇటీవల కాలంలో వైజాగ్ కాలనీ అందాలను చూసేందుకు పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది.

ఎటు చూసినా మనసు పులకరింపే

నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో ఉండే ఈ వైజాగ్ కాలనీ.. దేవరకొండ నియోజకవర్గంలోని నేరేడుగుమ్మ మండల పరిధిలో ఉంది. పర్యాటకులను అమితంగా ఆకర్షించే ప్రకృతి అందాలు ఈ ప్రాంతం సొంతం. నేరడుగొమ్ముతో పాటు చందంపేట మండలంలోని దట్టమైన అడవులు మరోవైపు నాగార్జునసాగర్ కృష్ణా నదీ పరివాహక ప్రాంతమంతా చుట్టూ నీరు, రకరకాల పక్షుల కిలకిలరావాలతో ఎటు చూసినా మనసును పులకరింపచేసే అందాలే.

ఇవేకాక భక్తి పారవశ్యానికి నిదర్శంగా నిలిచే అతి పురాతనమైన దేవాలయాలు, 3వ శతాబ్దంలో రాజులు, మునులు తపస్సు చేసిన ఆనవాళ్లు, గిరిజన సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి మరింత అభివృద్ధి చేస్తే ‘అరకు’ తరహాలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఏపీ నుంచి వలస

ఈ కాలనీవాసుల కుటుంబాలు గతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి వలసొచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. డ్యామ్ పరిసర ప్రాంతంలో నివాసముంటూ చేపల వేట ప్రధాన వృత్తిగా జీవనం కొనసాగిస్తున్నారు. పుట్టి, నాటు పడవల సాయంతో ప్రాజెక్ట్‌లని బ్యాక్ వాటర్‌లో చేపల వేటకు వెళ్తుంటారు. ఏపీలోని వైజాగ్ ప్రాంతం నుంచి వచ్చినవారే ఎక్కువ మంది ఉండటం వల్ల ‘వైజాగ్ కాలనీ’గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. 

మొన్నటి వరకు జలకళను కోల్పోయిన సాగర్ రిజర్వాయర్ పరిధిలో ఉపాధి లేక తల్లడిల్లిన మత్స్యకార్మిక కుటుంబాలు.. ప్రస్తుతం రిజర్వాయర్‌లోకి వరద నీరు చేరుతుండడంతో కృష్ణా నీళ్లను చూసి సంబుర పడుతున్నారు. వైజాగ్ కాలనీ చేపల్లో కొన్ని రకాలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర ప్రాంతాలకు కూడా ఇక్కడి చేపలు ఎగుమతి అవుతున్నాయి.