నష్టం అపారం
వడగండ్ల వాన చేతికొచ్చిన వరి పంటను కబళించింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని నీళ్లపాలు చేసింది. మొత్తానికి మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షం.. అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. కొనుగోలు కేంద్రాల్లో చేరిన వర్షపు నీటిని, ధాన్యాన్ని బుధవారం ఉదయం రైతులు బయటకు మళ్లించారు. పూర్తిగా తడిసిన ధాన్యాన్ని పక్కన పెట్టి పాక్షికంగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాలు పూర్తయినప్పటికీ, సకాలంలో ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్నదాతల ఆశలు ఆవిరి
అకాల వర్షంతో నష్టం అపారం
రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి పైరు నేలమట్టం
గాలిదుమారానికి మామిడితోటల్లో రాలిపడిన కాయలు
కొనుగోలు కేంద్రాల్లోకి వరద చేరి తడిసిన ధాన్యం
తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్
జయశంకర్ భూపాలపల్లి/ రాజన్న సిరిసిల్ల జిల్లా/ సిద్దిపేట/కరీంనగర్/ జగిత్యాల/యాదాద్రి భువనగిరి, మే 8 (విజయక్రాంతి): గాలిదుమారం, ఈదురుగాలులు, వడగండ్ల వానతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఎకరాల్లో సాగు చేస్తున్న వరి పైరు నేలవాలింది. యార్డులు, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం కురిసిన అకాల వర్షానికి కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్ద అయింది. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల బస్తాల ధాన్యం తడిసినట్లు జిల్లా అధికారులు అంచనా వేశారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించకపోవడంతోనే దిగుబడి నీళ్ల పాలైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు జిల్లావ్యాప్తంగా 323 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. కానీ ఇప్పటివరకు సేకరించిన ధాన్యం కేవలం 1.83లక్షల మెట్రిక్ టన్నులే. సిరిసిల్ల జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం అకాల వర్షంతో పాక్షికంగా తడిసింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించకపోవడంతో ప్రక్రియ ఆలస్యమవతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 7,577 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల్లోనే నిల్వ ఉంది. వడగండ్ల వానతో ఆ ధాన్యం పాక్షికంగా తడిసింది.
గాలిదుమారానికి సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 2,646 ఎకరాల్లోని మామిడి తోటల్లో కాయలు రాలిపడ్డాయి. నంగునూరు, సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు, బెజ్జంకి, కోహెడ, అక్కన్నపేట, గజ్వేల్, మర్కూక్, చేర్యాల, మద్దూరు, దుబ్బాక, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో తీవ్రత ఎక్కువగా కనిపించింది. మామిడి రైతులకు రాష్ట్రప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. నష్టంపై జిల్లా ఉద్యానశాఖ జిల్లా అధికారి సువర్ణ మాట్లాడుతూ.. ఇప్పటికే పంట నష్టాన్ని అంచనా వేశామని, ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని మందపల్లిలో వడగండ్ల వాన, గాలి దుమారానికి దీకొండ భూమయ్య, పోచవ్వ అనే వృద్ధ దంపతులు నివసిస్తున్న ఇంటి పైకప్పు ఎగిరిపడింది. కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం కారణంగా ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. దీంతో ధాన్యం కొనుగోళ్లపై బుధవారం అదనపు కలెక్టర్ చంద్రమోహన్ కలెక్టరేట్‌లో మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మిల్లులకు చేరిన ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్ చేయాలని ఆదేశించారు. రైతులు నష్టపోకుండా మిల్లర్లు తమ వంతు సహకారం అందించాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షానికి వేలాది ఎకరాల్లో వరి పైరు నేలమట్టమైంది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అన్నదాతకు తీరని నష్టం వాటిల్లింది. భూపాలపల్లి, మహాముత్తారం మండలాల్లోని ఆయా గ్రామాల్లో కోతకొచ్చిన వరి నేలమట్టమైంది. పొలాల్లో వర్షపు నీరు చేరడంతో వడ్లు మురిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వడగండ్లకు 50 శాతం గింజలు రాలిపోయాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు. లేకపోతే తాము అప్పుల ఊబిలో కూరుకుపోతామని, కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఉండదంటున్నారు.
వానల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర పౌర సరఫరాలశాఖ కమిషన్ డీఎస్ చౌహాన్
కరీంనగర్/ రాజన్న సిరిసిల్ల /జగిత్యాల, మే 8 (విజయ క్రాంతి): అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు వారం రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ ఆదేశించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని అంకిరెడ్డిపల్లి, నేరెళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూడు జిల్లాల అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్, రాంబాబు, ఖిమ్యా నాయక్‌తో కలిసి పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లపై సిబ్బంది సలహాలు సూచనలిచ్చారు. ఒక్కో ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఎంత ధాన్యం సేకరించారు.. ఎంతమంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశారు.. అనే అంశాలపై ఆయన ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులతో స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన రికార్డులను పక్కాగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రతి రైతు మొబైల్ నంబర్‌ను రికార్డుల్లో రాయాలన్నారు.
ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో
యాద్రాద్రి భువనగిరి, మే 8 (విజయక్రాంతి): అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి పోచంపల్లి మండలంలోని జూలూరుకు చెందిన రైతులు బుధవారం చౌటుప్పల్ మార్గంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో గంటల పాటు అటుగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే చౌటుప్పల్ మండలం జైకేసారం, భువనగిరి మండలంలోని హన్మాపురం, బస్వాపూర్ రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనలు చేపట్టారు. బస్వాపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం పరిశీలించారు. ధాన్యం తడిసినందున బాధలో ఉన్న రైతులను పరామర్శించారు.




