06-10-2025 06:24:12 PM
తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మద్దిరాల..
నియోజకవర్గంలో అత్యధిక మంది కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారు ఇక్కడే..
స్థానికం, పార్టీ విధేయత కంటే, ధనం చుట్టే రాజకీయం..
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం జిల్లా పరిషత్ ఎన్నికలలో జనరల్ ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించడంతో ఆశావాహులు భారీగా కాంగ్రెస్ తరపున టికెట్ అభ్యర్థిత్వానికి 14 మంది పేరు నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో ముగ్గురిని కాంగ్రెస్ అధిష్టానానికి జెడ్పిటిసి టికెట్ కోసం పంపవలసిందిగా జిల్లా అధ్యక్షుని, స్థానిక ఎమ్మెల్యేను కోరడమైనది. అందులో ప్రధానంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన కొండగడుపుల శ్రీకాంత్, బరపటి ఉపేందర్, బరపటి ప్రవీణ్ మాల సామాజిక వర్గానికి చెందిన బొబ్బని రఘుపతి, బొబ్బిలి వెంకన్న మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది.
వీరిలో బరపటి ప్రవీణ్ కొత్తగా పార్టీలో వినిపిస్తున్న పేరు, ఇతను కుక్కడం గ్రామానికి చెందిన వ్యక్తి. కొండగడుపుల శ్రీకాంత్ గత 15 సంవత్సరాలుగా ఎంపీడీవో ఆఫీస్ లో ఉమ్మడి నూతనకల్ మండలంలో, విభజిత మద్దిరాల మండలంలో బయోమెట్రిక్ కోఆర్డినేటర్ గా కొనసాగుతున్నారు. జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నకు నమ్మకస్తుడుగా కొన్ని సంవత్సరాలుగా ఉంటు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు. బరపాటి ఉపేందర్ రెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ గా, ఎంపీటీసీగా పనిచేశారు. బొబ్బని రఘుపతి కూడా పోటీలో ఉంటూ చెవిటి వెంకన్నకు నమ్మకస్తుడిగా ఉంటున్నారు. బొబ్బిలి వెంకన్న జి కొత్తపల్లి సర్పంచ్ గా ఎంపీటీసీగా పని చేశారు. ప్రధానంగా శ్రీకాంత్, ప్రవీణ్, ఉపేందర్, జడ్పిటిసి రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న వ్యక్తికి వచ్చేనా లేక పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు వచ్చేనా వేచి చూడాల్సిందే మరి.